ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెట్టిన జనసేనాని వారాహి.! వాట్ నెక్స్‌ట్.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా తయారు చేయించబడ్డ వాహనం ‘వారాహి’ తెలంగాణలోని కొండగట్టు దేవాలయంలో ప్రత్యేక పూజలు జరుపుకుంది. అనంతరం, వాహనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలోగల కనక దుర్గ దేవస్థానానికి తీసుకెళ్ళారు.కొండగట్టులోనూ, విజయవాడలోనూ ‘వారాహి’కి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం, ‘వారాహి’ వాహనంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ నుంచి మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్ళారు.

ఈ క్రమంలో జనసేన అధినేతకు అడుగడుగునా స్థానిక జనసేన శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ‘మనల్ని ఎవడ్రా ఆపేది..’ అంటూ వేలాది మంది కార్యకర్తలు అభిమానులు వెంటరాగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి’ వాహనం నుంచే అభివాదం చేసుకుంటూ ముందుకెళ్ళారు. కాగా, ‘వారాహి’ వాహనాన్ని ఆ:ద్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టనిచ్చేది లేదంటూ మీసం మెలేసినోళ్ళు, తొడలుకొట్టేసినోళ్ళు.. ఇప్పుడు పత్తా లేకుండా పోయారన్న ఎద్దేవా జనసేన నుంచి అధికార వైసీపీ మీదకు దూసుకెళుతోంది.

‘నిబంధనలకు అనుగుణంగా వాహనం వుంటే మేమెందుకు అడ్డుకుంటాం.?’ అంటోంది అధికార వైసీపీ. ఆ మాత్రందానికి, ‘వారాహి’ చుట్టూ వైసీపీ నేతలు.. అందునా మంత్రులెందుకు అత్యుత్సాహంతో కూడిన విమర్శలు చేసినట్లు.? ‘వారాహి’కి ఇప్పుడు ఇంత హైప్ క్రియేట్ అయ్యిందంటే అది వైసీపీ నేత పుణ్యమే. అంతా బాగానే వుందిగానీ, ‘వారాహి’పై ఎప్పుడు జనసేన అధినేత రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుడతారు.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.