వంగవీటి రాధ వివాహ వేడుకలో వైసీపీ – జనసేన సందడి… పిక్స్ వైరల్!

దివంగత నేత వంగవీటి మోహనరంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ – పుష్పవల్లిల వివాహ వేడుక ఆదివారం రాత్రి కృష్ణాజిల్లాలో ఘణంగా జరిగింది. పోరంకిలోని ఎం రిసార్ట్స్ లో జరిగిన ఈ వివాహ వేడుకకు భారీ సంఖ్యలో బందువులు, స్నేహితులు, అభిమానులు, నాయకులు, పలువురు ప్రముఖులు హాజరయ్యరు.. నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి వైసీపీ, జనసేన, టీడీపీ నేతలు పార్టీలకు అతీతంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, బీఆరెస్స్ ఏపీ చీర్ఫ్ తోట చంద్రశేఖర్‌ హాజరయ్యారు. దీనికి సంబంధించిన వివరాలను జనసేన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

“విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వంగవీటి రాధాకృష్ణ వివాహ వేడుకకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. విజయవాడలోని పోరంకిలోని మురళీ రిసార్ట్స్‌ లో జరిగిన ఈ వేడుకకు పవన్ కళ్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. నూతన వధూవరులు వంగవీటి రాధాకృష్ణ, పుష్పవల్లిలకు శుభాకాంక్షలు తెలిపారని” ట్విటర్‌ లో తెలిపారు.

వధువు పుష్పవల్లి తండ్రి నర్సాపురంలో జనసేన నేతగా ఉండగా… వారాహి యాత్ర వేళ పవన్ వారి ఇంట్లోనే బస చేసారు! ఇదే సమయంలో… వంగవీటి రాధా వివాహ ఖరారు విషయంలోనూ స్థానిక టీడీపీ, జనసేన స్థానిక నేతలు మధ్యవర్తిత్వం వ్యవహరించారని చెబుతున్నారు! ఈ నేపథ్యంలో ఈ వివాహ వేడుకలో జనసేన అధినేత పవన్ పాల్గొన్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇదే సమయంలో… ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, కొలుసు పార్థసారథి, గద్దె రామ్మోహన్‌, మాజీ డిప్యూటీ స్పీకర్‌ బూరగడ్డ వేదవ్యాస్‌, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మాజీ మంత్రులు కామినేని శ్రీనివాస్‌, కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌, జలీల్‌ ఖాన్‌, యార్లగడ్డ వెంకట్రావు, పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

కాగా… వంగవీటి రాధాకృష్ణ 2004 లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత పలుసార్లు పోటీ చేసినప్పటికీ అసెంబ్లీలో అడుగుపెట్టలేక పోయారు. ఇటీవల లోకేష్ యువగళం పాదయాత్రలో కనిపించారు. ఆ సంగతి అలాఉంటే… త్వరలో వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, వంగవీటి రాధాకృష్ణ స్నేహితులన్న విషయం తెలిసిందే!