విజయవాడ రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. రాజకీయ పరంగా, ఇటు సామజిక పరంగా మంచి పట్టు ఉన్న నాయకుడు వంగవీటి రాధా. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ తీసుకున్న నిర్ణయం వంగవీటి రాధాకు భంగపాటు కలిగించింది.
ఆయన గత కొన్ని నెలలుగా వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ తీసుకున్న నిర్ణయం ఆ వార్తల్లో నిజం ఉన్నట్టు తెలుస్తోంది.
రాధా విజయవాడ సెంట్రల్ నుండి పోటీ చేయాలని అనుకుంటున్నారు. కానీ జగన్ ఆ స్థానాన్ని మరొకరికి కేటాయించడంతో రాధా అసంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. వైసీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమానికి వైసీపీ సీనియర్ నేతలు బొత్స, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కే.పార్ధసారధి, సామినేని ఉదయభాను, వెలంపల్లి శ్రీనివాస్, వంగవీటి రాధా తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో విజయవాడ సెంట్రల్, పశ్చిమ నియోజక వర్గాల్లోని గ్రూపు రాజకీయాల గురించి చర్చ నడిచినట్టు తెలుస్తోంది. పశ్చిమ నియోజక వర్గంలో వంగవీటి రాధా అండ చూసుకుని కొంతమంది వెలంపల్లికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆయన భావిస్తున్నారు. ఇటు విజయవాడ సెంట్రల్ నియోజక వర్గంలో రాధా, మల్లాది విష్ణు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిని అదునుగా భావించిన వెలంపల్లి రాధాకు ఈ విషయంలోనే చెక్ పెట్టాలి అనుకున్నారు.
రాధా ఆశిస్తున్న సెంట్రల్ టికెట్ మల్లాడి వచ్చేలా పావులు కదిపారు. వీరికి పెద్దిరెడ్డి ఆశీర్వాదం కూడా యాడ్ అయింది. దీంతో సెంట్రల్ టికెట్ మల్లాదికి ఇప్పించడంలో విజయం సాధించారు వెలంపల్లి వర్గం. వైసీపీ అధిష్టానం రాధను సెంట్రల్ మీద కాకుండా మచిలీపట్టణం పార్లమెంటు నియోజకవర్గంపై దృష్టి సారించాలని సూచించింది. అధిష్టానం తీర్పుతో అసంతృపతి చెందిన రాధా అక్కడి నుండి అలిగి వెళ్లిపోయారు.