Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి గత కొంత కాలంగా చట్టపరమైన కేసులతో విశ్రాంతి లేకుండా గడుస్తోంది. ఇక ఇటీవల కోర్టు ఆదేశాలు మరోసారి నిరాశపర్చాయి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వంశీపై నకిలీ ఇళ్లపట్టాల పంపిణీ కేసులో దాఖలైన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నూజివీడు కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. అయితే ఈ కేసులో పోలీసులు ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదని గుర్తించిన న్యాయస్థానం, అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
ప్రస్తుతం వంశీ విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పటికే ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్, అక్రమ మైనింగ్, నకిలీ పట్టాల పంపిణీ వంటి అంశాలపై కేసులు నమోదయ్యాయి. అయితే వీటిలో కొన్ని కేసుల్లో వంశీకి బెయిల్ లభించినా, మిగిలిన కేసుల పరిణామాలు ఆయనను జైల్లోనే నిలిపేశాయి.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వంశీపై కేసుల ఊబకం పెరిగింది. ఆయన్ని టార్గెట్ చేస్తున్నారన్న ఆరోపణలు వైసీపీ వర్గాల నుంచి వస్తున్నప్పటికీ, కోర్టుల తీర్పులు మాత్రం వేరే దిశలో సాగుతున్నాయి. నకిలీ పట్టాల కేసులో ముందస్తు బెయిల్ పై కూడా స్పష్టత రాకపోవడంతో వంశీకి తాత్కాలికంగా బయటపడే దారి మూసుకుపోయినట్టే. రేపటి విచారణపై ఇప్పుడు ఆయన అనుచరులు ఆశలు పెట్టుకున్నారు.