ఆంధ్రప్రదేశ్ రాజకీయల్లో వల్లభనేని వంశీ మళ్లీ హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల టీడీపీ కార్యాలయంపై జరిగిన ఘటనలో అరెస్టై, సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో బెయిల్ పొందిన వంశీకి… ఇప్పుడు కొత్త కేసు మరోసారి కష్టాలు తెచ్చిపెట్టేలా ఉంది. గన్నవరంలో మైనింగ్ అక్రమాలకు సంబంధించి, మైనింగ్ శాఖ అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో వంశీపై మరో కేసు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
వైసీపీ హయాంలో వంశీ అత్యధికంగా మైనింగ్ అనుమతులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలతో ఈ కేసు దాఖలైనట్టు తెలుస్తోంది. మొత్తం రూ.100 కోట్ల వరకు అక్రమ మైనింగ్ జరగిందన్న ఆరోపణలపై గన్నవరం పోలీసుల దర్యాప్తు మొదలైంది. ఇప్పటికే ఎన్నికల తుది దశలో ఉన్న సమయంలో వంశీపై నకిలీ ఇళ్లపట్టాల కేసు, బెదిరింపు కేసులు, పీటీ వారెంట్లు సవాళ్లుగా మారాయి. నూజివీడు కోర్టు ఇచ్చిన తాజా అనుమతుల ప్రకారం, మే 19 లోపు వంశీని హాజరు పరచాల్సిన దశ వచ్చేసింది.
ఈ నేపథ్యంలో వంశీ చుట్టూ లీగల్ చిక్కులు మరింత గాడి పడుతున్నాయి. ఇప్పటికే కొన్ని కేసుల్లో బెయిల్స్ దక్కినప్పటికీ, కొత్త కేసుల నమోదుతో ఆయనను మళ్లీ అరెస్టు చేసే అవకాశం ఉంది. వంశీ కేసుల వెనుక రాజకీయ కుట్ర ఉందా? లేక నిజంగా అవినీతి జరిగినదేనా? అన్నది అధికారవర్గాలు, విపక్షాలలో హాట్ టాపిక్ గా మారిన ప్రశ్న. కానీ వాస్తవం ఏదైనా ఉండొచ్చు… కానీ వంశీకి ఈ కేసుల చిట్టా మాత్రం గట్టి ఎదురుదెబ్బగా మారుతోంది.