అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వైకాపా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు?

అనంతపురం జిల్లా రాయదుర్గం వైకాపా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు పప్పిరెడ్డి మంజునాథరెడ్డి (34) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే…అన్నమయ్య జిల్లాలోని రామాపురం మండలం హసనాపురం పంచాయతీలోని పప్పిరెడ్డిగారి పల్లెకి చెందిన మహేశ్వర్‌రెడ్డి పీఎంఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ యజమాని, వైకాపా నాయకుడు. మహేశ్వర్ రెడ్డి కుమారుడు మంజునాథ్ రెడ్డి కూడా బిజినెస్ పనులు చూసుకుంటూ ఉంటాడు. మంజునాథ్ రెడ్డి తరచు గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని అవంతి అపార్ట్‌మెంట్‌ 101వ నంబరు ఫ్లాటుకు అప్పుడప్పుడు వచ్చి రెండు మూడు రోజులు ఉండి వెళ్తుంటాడు.

ఈ క్రమంలో మూడు రోజుల క్రితం కుంచనపల్లికి వచ్చిన మంజునాథ్ రెడ్డి శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఫ్లాటు బాధ్యతలు చూసుకునే నరేంద్రరెడ్డి అనే వ్యక్తి శుక్రవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ప్లాట్ కి వచ్చి చూడగా తలుపు, కిటికీలు మూసి ఉండటంతో ఎంతసేపటికీ తలుపు కొట్టినా తీయలేదు. దీంతో కిటికీ పైకి ఎక్కి నరేంద్ర రెడ్డీ లోపలికి వెళ్ళి చూడగా మంజునాథ రెడ్డి మంచం పక్కన స్పృహ లేకుండా పడిపోయాడని నరేందర్ రెడ్డి వెల్లడించాడు. ఈ క్రమంలో స్థానికుల సహాయంతో మంజునాథ్ రెడ్డిని ఎక్కించుకుని ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు నరేందర్ రెడ్డి వివరించాడు. ఆ తర్వాత మంజునాథ్ రెడ్డి తండ్రి మహేశ్వర్ రెడ్డికి సమాచారం అందించాడు.

తన కుమారుడు మరణించిన విషయం తెలుసుకున్న మహేశ్వర్ రెడ్డి హుటాహుటిన విజయవాడకు బయలుదేరి వెళ్లారు. మంజునాథ్ రెడ్డి మరణాన్ని మొదట ఆత్మహత్యగా భావించినప్పటికీ అక్కడ పరిస్థితులను చూసి అనుమానాస్పద మృతిగా భావిస్తున్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి వెళ్లి మంజునాథ్ రెడ్డి మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ఘటన పై మంజునాథ్ రెడ్డి తండ్రి మహేశ్వర్ రెడ్డి ‘ఈనాడు’కు ఫోన్‌లో వివరించారు. ఇతర రాష్ట్రాల్లో మంజునాథ్ రెడ్డీ చేసిన కొన్ని పనులకు సంబంధించి రాంకీ సంస్థ నుంచి మా కంపెనీకి బిల్లులు రావాల్సి ఉంది. అంతే కాకుండా మరోవైపు బ్యాంకు నుంచి ఫైనాన్స్‌ కు సరైన సమయంలో అందలేదు. ఈ నేపథ్యంలో మా మంజునాథ్ రెడ్డీ కొన్ని రోజులుగా ఒత్తిడికి గురవుతున్నారు’ అని మహేశ్వర్ రెడ్డి వెల్లడించాడు.