అనంతపురం జిల్లాలో దారుణం… కూతురి ప్రేమ విషయం తెలిసి దారుణంగా హత్య చేసిన తండ్రి!

ప్రస్తుత కాలంలో యువతీ యువకులు చిన్నవయసులోనే ప్రేమలో పడుతున్నారు. అయితే ప్రేమ, వ్యామోహం గురించి పూర్తి అవగాహన లేని చిన్న వయసులోనే ఇలా ప్రేమలో పడి కొందరు యువతీ యువకులు తల్లిదండ్రులను మోసం చేసి ప్రేమించిన వారి వెంట వెళ్తున్నారు. ఇలా వెళ్లినవారు కొంతకాలానికి మళ్లీ ఒకరికొకరు దూరమవుతున్నారు. అంతేకాకుండా కొందరి తల్లిదండ్రులు ఈ ప్రేమ వ్యవహారాల పట్ల చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. పిల్లల ప్రేమ విషయం తెలియగానే వారిని మందలించటమే కాకుండా తక్కువ కులానికి చెందిన వారిని ప్రేమించటంతో పరువు పోతుందని భావించి తమ పిల్లల్ని హత్యలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. అనంతపురంలో ఇటీవల మరొక పరువు హత్య వెలుగులోకి వచ్చింది.

వివరాలలోకి వెళ్తే… అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం చెర్లోపల్లిలో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. చెర్లోపల్లికి చెందిన స్వాతి అనే పదహారేళ్ల యువతి ఇంటర్ ఫెయిల్ అవ్వటంతో ఇంటి వద్దనే ఉంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంది. ఈ క్రమంలో అదే గ్రామంలో తమ ఇంటికి దగ్గరలో నివాసం ఉంటున్న తక్కువ కులానికి చెందిన యువకుడితో ప్రేమలో పడింది. కొంతకాలానికి స్వాతి ప్రేమ విషయం తన తండ్రికి తెలియటంతో తక్కువ కులం వాడితో ప్రేమ ఏంటి అని పలమార్లు ఆమెను మందలించాడు.

అయినా కూడా స్వాతి ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు. ఈ విషయమై తరచూ తండ్రి కూతురు మధ్య గొడవలు కూడా జరిగేవి. ఇటీవల కూడా ఇదే విషయమై తండ్రీ కూతురు మధ్య గొడవ జరిగింది. తక్కువ కులం వాడితో ప్రేమ మంచిది కాదని ఎంత చెప్పినా కూడా స్వాతి తన తండ్రి మాటకు ఎదురు చెప్పటంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె తండ్రి ఇంట్లో ఉన్న రోకలిబండ తీసుకొని ఆమె తలపై గట్టిగా కొట్టాడు. దీంతో స్వాతి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు వచ్చి చూడగా స్వాతి అప్పటికీ మృతి చెందింది. ఈ విషయం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు.