సింగర్ మంగ్లీ నిజజీవితంలో కన్నీటి సవాళ్లు.. ఇంతకీ అవేంటంటే?

మంగ్లీ జానపద, సినీ గాయని, సినీనటి. 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ జానపద కళాకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది. మంగ్లీ అనంతపురం జిల్లాలోని ఒక పేద బంజారా కుటుంబంలో జన్మించింది. ఈమె అసలు పేరు సత్యవతి. తండ్రి పనిచేస్తేనే కుటుంబ పోషణ జరిగేది.

ఈమెను చదివించడం కూడా చాలా కష్టంగా మారింది. చిన్నప్పటినుండే పాటలు పాడమంటే ఎంతో ఇష్టం. పదవ తరగతి వరకు ఏదోలాగా చదివించారు తల్లిదండ్రులు. పై చదువులు చదివించాలని ఆశ ఉన్న ఆర్థిక స్తోమత అడ్డుపడింది. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారి సలహాతో, ఆర్థిక సహకారంతో తిరుపతిలో కర్ణాటక సంగీతంలో జాయిన్ అయింది.

ఈ ట్రస్టు సహకారంతోనే ఎస్ వి విశ్వవిద్యాలయంలో మ్యూజిక్ అండ్ డ్యాన్స్ డిప్లమా కోర్సులో చేరింది. ఈ సంస్థ ద్వారా ఫీజుల వరకు మాత్రం పరవాలేదు కానీ మిగతా ఖర్చులకు కూడా తల్లిదండ్రులు చాలా కష్టపడి ఇచ్చేవారు. చివరి సంవత్సరంలో ఉండగా తల్లిదండ్రుల కష్టాలు చూడలేక కోర్సు పూర్తికాకుండానే ఇంటికి వచ్చేసింది. తరువాత తన సీనియర్స్ సలహాతో గచ్చిబౌలిలో చిన్న పిల్లలకు సంగీత టీచర్ గా పాఠాలు చెప్పేది.

ఆ తర్వాత మంగ్లీ తీన్మార్ ప్రోగ్రాం ద్వారా ప్రేక్షకులకు చేరువైంది. v6 టీవీలో జానపద కార్యక్రమం జరుగుతుంటే భిక్షు నాయక్ అనే జానపద గాయకుడు ఆమెను ఆ ఛానల్ కు పంపించాడు. ఆ తర్వాత ఛానల్ వాళ్ళు యాంకర్ గా అవకాశం ఇచ్చారు. పేరును కాస్త మార్చుకోమని సలహా ఇస్తే తన తాతమ్మ పేరు మంగ్లీని తన పేరుగా మార్చుకుంది. ఆ పేరు తోనే మాటకారి మంగ్లీ అనే కార్యక్రమం మొదలైంది.

తర్వాత ఎంటర్టైన్మెంట్ యాంకర్ గా నేషనల్ అవార్డు కూడా గెలుచుకుంది. ఆ తరువాత తెలంగాణ ఆవిర్భవ సందర్భంగా పాడిన రేలా… రేలా…రే అనే పాట మంగ్లీని సెలబ్రిటీ సింగర్ గా మార్చింది. ఆ తర్వాత గోర్ జీవన్ అనే లంబాడి చిత్రంలో హీరోయిన్ గా కూడా నటించడం జరిగింది. లంబాడి ఆడపిల్లలను కాపాడుకోవాలి అనే సందేశం ఇచ్చే సినిమా అది.

ఆమె ఉల్లాల ఉల్లాల, మాస్ట్రో సినిమాలలో నటించింది. ప్రస్తుతం సినిమాలలో పాటలు పాడుతూ బిజీగా గడుపుతున్నట్లు సమాచారం.