ఆటోడ్రైవర్లను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం రూ.15000 ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే 2025-26 సంవత్సరానికి వాహనమిత్ర పథకం మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఈ క్రమంలో నేటి నుంచి అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది. 19వ తేదీ లోపు దరఖాస్తులను స్వీకరించనుంది. ఈనెల 22లోపు ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేస్తారు. సెప్టెంబర్ 24వ తేది నాటికి తుది జాబితా సిద్ధం చేయనున్నారు.
అనంతరం కార్పొరేషన్ల వారీగా లబ్ధిదారుల జాబితాను రవాణాశాఖకు పంపుతుంది. అక్టోబర్ 1వ తేదీన లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమచేయనుంది.దరఖాస్తుల స్వీకరణ కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ తీసుకుకొచ్చింది. గత ప్రభుత్వంలో ఆర్థిక సహాయం పొందిన లబ్ధిదారుల వివరాలను సచివాలయ సిబ్బంది సేకరించనున్నారు. అలాగే కొత్తగా అర్హులైన ఆటో డ్రైవర్ల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈమేరకు ప్రత్యేక అప్లికేషన్ ఫామ్ కూడా విడుదల చేసింది.
దరఖాస్తులో లబ్ధిదారు పేరు, తండ్రి పేరు, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, కులం– ఉపకులం, కుల ధృవీకరణ పత్రం నెంబర్, బ్యాంకు అకౌంట్ నంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, బ్రాంచ్ పేరు, ఆదాయ ధృవీకరణ పత్రం నెంబర్, వార్షిక ఆదాయం వివరాలు, ఇంటి చిరునామా, వాహనం వివరాలు, వాహన గుర్తింపు సంఖ్య, చెల్లుబాటు అయ్యే తేదీ, డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ వంటి వివరాలను అందజేయాలి. ఇక దరఖాస్తులో పేర్కొన్న వివరాలన్నీ పూర్తిగా వాస్తవం అని తెలియజేయాలి. అధికారులు తనిఖీ చేసినప్పుడు వివరాలు అవాస్తవం అని తెలిస్తే ప్రభుత్వం తీసుకునే చట్టపర్యమైన చర్యలకు బాధ్యుడినై ఉంటానని డిక్లరేషన్ సంతకం పెట్టాలి.
కాగా గత వైసీపీ ప్రభుత్వం వాహన మిత్ర పేరుతో ఆటోడ్రైవర్లకు రూ.10వేల ఆర్థిక సహాయం అందించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ మొత్తాన్ని రూ.15వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం అర్హతలు ఇవే..
* ఏపీ రిజిస్ట్రేషన్‌తో వాహనం రిజిస్ట్రేషన్ అయి ఉండాలి.
* డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి
* దరఖాస్తుదారులు దారిద్ర రేఖకు దిగువన ఉండి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి.
* ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకపోతే నెల లోపు సమర్పించాలి.
* మాగాణి అయితే మూడు ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాల లోపు ఉండాలి. మాగాణి, మెట్ట కలిపి 10 ఎకరాల లోపు ఉండాలి.
* పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ నివాస, వానిజ్య నిర్మాణం ఉండకూడదు.
* దరఖాస్తుదారు లేదా కుటుంబసభ్యులు ప్రభుత్వ ఉద్యోగి/ పెన్షనర్‌గా ఉంటే అనర్హులు అవుతారు.
* పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు మాత్రం మినహాయింపు ఉంటుంది.
* కరెంట్ వినియోగం నెలకు 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి.
* వాహనాలకు ఎలాంటి పెండింగ్ బకాయిలు, చలాన్లు ఉండకూడదు.
