అన్‌లాక్ మొదలవుతోంది.. దేశం సిద్ధంగా వుందా మరి.?

Unlock On The Way, Is India Ready To Face third wave?

Unlock On The Way, Is India Ready To Face third wave?

కరోనా వైరస్ సెకెండ్ వేవ్ నేపథ్యంలో దేశంలో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ మోడ్‌లోకి వెళ్ళిపోయిన విషయం విదితమే. లాక్ డౌన్ పేరు పెట్టకుండా కర్ఫ్యూ పేరుతో లాక్ డౌన్ తరహా నిబంధనలు మరికొన్ని రాష్ట్రాల్లో అమలవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా దేశంలో లాక్ డౌన్ విధించలేదుగానీ, ప్రస్తుతం దేశంలో నడుస్తున్నది లాక్ డౌన్ లాంటిదే. కేంద్రం లాక్ డౌన్ ప్రకటిస్తే, ప్రజల్ని ఆదుకోవడానికి కొన్ని ప్రత్యేక చర్యల్ని కేంద్రం చేపట్టాల్సి వుంటుంది.

ఆ తలనొప్పి లేకుండా, బాధ్యతల నుంచి తప్పుకున్న కేంద్రం, రాష్ట్రాల నెత్తిన ఆ భారాన్ని వేసేసి చేతులు దులుపుకుంది. ఇక, వివిధ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గత కొద్ది రోజులుగా గణనీయంగా తగ్గుతున్నాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్నాళ్ళ క్రితం అనూహ్యంగా పెరిగిన కేసులు ఇప్పుడు తగ్గాయి. మహారాష్ట్రలోనూ కరోనా వైరస్ అదుపులోకి వస్తోంది. తెలంగాణలోనూ పరిస్థితి మెరుగ్గానే వుంది. అయితే, కేరళ, కర్నాటక తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రం కరోనా సెకెండ్ వేవ్ ఇంకా తీవ్రంగానే వుంది. ఆంధ్రపదేశ్‌లో కూడా పరిస్థితి ఆందోళనకరంగానే వుంది. ఈ పరిస్థితుల్లో కొన్ని రాష్ట్రాలు అన్ లాక్.. అనడం వల్ల దేశానికి కొత్త ముప్పు వచ్చేలా వుంది. జూన్ 1 నుంచి కొన్ని రాష్ట్రాల్లో దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేసే ప్రక్రియ మొదలు పెట్టబోతున్నారు.

ఈ మేరకు ఆయా రాష్ట్రాలు ఇప్పటికే నిర్ణయం తీసుకునే పనిలో బిజీగా వున్నాయి. కాగా, అతి త్వరలో దేశం కరోనా వైరస్ మూడో వేవ్ ఎదుర్కోవాల్సి వుంటుందంటూ పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశం ఇంకో వేవ్‌ని ఎదుర్కోవడం చాలా చాలా కష్టం. పైగా, మూడో వేవ్ చిన్న పిల్లల మీద ప్రభావం చూపనుందని అంటున్నారు. అదే నిజమైతే, అది ఇంకా భయంకరమైన పరిస్థితి కాబోతోంది. ఇదిలా వుంటే, లాక్ డౌన్ నేపథ్యంలో దేశ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. రాష్ట్రాల సంగతి సరే సరి. ఇవన్నీ ఓ యెత్తు.. సామాన్యుడి బతుకు దుర్భరం అయిపోవడం ఇంకో యెత్తు. ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించేసి చేతులు దులిపేసుకుంటున్నాయిగానీ, ప్రజల్ని పట్టించుకోవడంలేదు. అటు మూడో వేవ్ భయం.. ఇంకో వైపు బతుకు చక్కిదిద్దుకునేందుకు అవకాశం దొరుకుతోందన్న ఊరట.. వెరసి, సామాన్యుడికి ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి నెలకొందిప్పుడు.