చంద్రబాబుది యుటర్న్ రాజకీయం…

రాజకీయ అవసరాల కోసమే చంద్రబాబు ప్రత్యేక హోదా పేరుతో యూ టర్న్ తీసుకున్నారని కేంద్ర హోమంత్రి రాజ్‌నాథ్ సింగ్  విమర్శించారు. ఈ రోజు మంగళగిరిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి  ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం రాజ్‌నాథ్ మాట్లాడుతూ రాష్ట్రానికి అందజేసిన నిధుల వివరాలను తెలియజేశారు. విజయవాడ అభివృద్ధికి రూ.1000 కోట్లు అందజేశామన్న రాజ్‌నాథ్ అమరావతి నిర్మాణానికి రూ.1500 కోట్లు ఇచ్చామని, పోలవరం నిర్మాణానికి పూర్తి స్థాయిలో నిధులిస్తామని వెల్లడించారు.

రాష్ట్ర అభివృద్ధి పట్ల నిబద్ధత ఉందన్న ఆయన.. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే కాదని.. ప్రత్యేకంగా ట్రీట్ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఏపీకి తాము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కానీ ఏపీ ప్రభుత్వమే తీసుకోవడానికి సిద్ధంగా లేదని రాజ్‌నాథ్ తీవ్రమయిన ఆరోపణ చేశారు.  దేశంలో మూడింట రెండొంతుల భూభాగంపై బీజేపీ అధికారంలో ఉందని చంద్రబాబుకు గుర్తు చేస్తూ  బీజేపీని ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా రాజ్‌నాథ్ అభివర్ణించారు.