కిడారి హత్య కేసులో ఊహించని ట్విస్ట్

ఈరోజుకి సరిగ్గా వారం రోజుల క్రితం మావోయిస్టులు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుని, మాజీ ఎమ్మెల్యే సివేరి సామాను కాల్చి చంపేశారు. వీరి మరణ వార్తతో ఒక్కసారిగా నాయకులు, పోలీసులు, ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇన్ని రోజులు మౌనంగా ఉన్న మావోలు ఒక్కసారిగా ఇద్దరు నేతలను చంపి వారి ఉనికిని చాటుకున్నారు.

కాగా ఈ హత్యకు పథకం రచించిన వారి దగ్గర నుండి అమలు చేసిన వారి వరకు పోలీసు అధికారులు ఒక అవగాహనకు వాచినట్టు తెలుస్తోంది. మావోయిస్టులకు సహకరించిన వ్యక్తులు, మావోల సానుభూతిపరుల గురించి ఎంక్వయిరీ చేసారు. ఈ తరుణంలో శనివారం ఇద్దరు అనుమానితులను సైతం అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు.

షాకింగ్ విషయం ఏమిటంటే… వీరిద్దరూ కిడారికి అత్యంత సన్నిహితులని తెలుస్తోంది. ఎమ్మెల్యే మూమెంట్స్ ను ఎప్పటికప్పుడు మావోలకు అందించి ఆయనను ఉచ్చులోకి దింపింది కూడా వీరేనని అంటున్నారు అధికారులు. వారి ఫోన్ కాల్ డేటాను పరిశీలించాక పోలీసులు నిర్ధారణ చేసుకున్నట్టు తెలుస్తోంది. మరో విషయం ఏమిటంటే… జంట హత్యల తర్వాత కూడా మావోలు ఆ పరిసరాల్లోనే రెండు రోజులు గడిపినట్టు పోలీసులకు ఉన్న సమాచారం.

వారిని చంపేశాక కూడా నక్సల్స్ తమ స్థావరాలకు చేరుకోలేదని స్పష్టమవుతుంది. ఇంకా వారు మన్యం పరిధిలోని ఒడిశా సరిహద్దు గ్రామాల్లోనే ఉంటున్నట్టు సమాచారం. ఆ గ్రామాలను గుర్తించిన ఆంధ్రా పోలీసులు ఒడిశా కాప్స్ తో కలిసి వారిపై అట్టాక్ కు రెడీ అవుతున్నారు. ఎలాంటి ఎదురుదాడి ఎదురైనా స్ట్రాంగ్ గా జవాబు చెప్పాలన్న కసితో ఉన్నారు పోలీసులు. ఈ ఘటనతో డిజిపి ఠాకూర్ తీవ్ర ఆవేదనకు గురైనట్టు శుక్రవారంనాడు జరిగిన భేటీలో గమనించారు అధికారులు. డిజిపి తమపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకోలేకపోయామని పోలీసులు కలత చెందుతున్నారు.