కిడారి హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్… కేసులో ఊహించని మలుపు

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోలు హత్య చేసిన కేసు రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. విచారణ చేపట్టిన పోలీసులకు ఒక విషయం ఛేదిస్తే మరొక ట్విస్ట్ ఛాలెంజింగ్ గా తయారవుతోంది. ఈ కేసులో మరొక కోణం వెలుగులోకి వచ్చింది. హత్య జరిగిన రోజు కిడారి ప్రయాణిస్తోన్న కారులో మూడు కోట్ల రూపాయలు ఉన్నట్టు పోలీసుల విచారణలో బయటపడినట్టు సమాచారం. అయితే ఈ డబ్బును వారు ఎందుకు తీసుకెళ్లారు అనే కోణంలో ఆలోచిస్తున్న పోలీసులకు పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.

కిడారి కారులో 3 కోట్లు ఉన్నట్టు భావిస్తున్న అధికారులు… ఆ డబ్బును కిడారి ఏదైనా సెటిల్మెంట్స్ కోసం తీసుకెళ్తున్నాడా? లేక మావోలకు ఇచ్చేందుకే తీసుకెళ్లి ఉంటాడా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. సిట్ అధికారుల బృందం దీనిపై పలు కోణాల్లో ఆరా తీస్తున్నారు. సర్రాయి వద్ద మైనింగ్ సెటిల్మెంట్ కోసం ఆ డబ్బును తీసుకెళ్లి ఉంటాడు అనే వాదన కూడా గట్టిగా వినబడుతోంది. అయితే ఆ జంట హత్య తర్వాత కారులో ఉన్న సొమ్ము కనపడకుండా పోయినట్టు తెలుస్తోంది. ఈ డబ్బును మావోలు తీసుకెళ్లారా లేక మరేమైనట్టు అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఈ డబ్బు ఏమైనట్టో తెలిస్తే మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉంటాయని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం.

ఇదిలా ఉండగా… కిడారి, సివేరిల హత్య జరిగిన తర్వాత ఏజెన్సీలో జరిగిన అల్లర్లను నియంత్రించడంలో ఫెయిల్ అయ్యారంటూ డుంబ్రిగుడ ఎస్సైని సస్పెండ్ చేసిన పోలీసు అధికారులు రీసెంట్ గా ఏపీఎస్పీ ఆఫీస్ కమాండర్, ఆర్ ఐ లపై సస్పెన్షన్ వేటు విధించారు. అరకు సిఐని వీఆర్ లో పెడుతూ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. జంట హత్యలు, ఘటన తర్వాత జరిగిన హింసాకాండపై సిట్ బృందం దర్యాప్తును ముమ్మరం చేసింది. సిట్ ఉన్నతాధికారి ఫకీరప్ప ఏజెన్సీలోనే ఉంటూ దర్యాప్తును వేగవంతం చేసారు. ఏ చిన్న క్లూ దొరికిన విడిచిపెట్టడం లేదు. అనుమానం ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే కిడారిని మావోల ఉచ్చులో దింపినట్టు భావిస్తున్న కిడారి సన్నిహితులను రిమాండ్ లో ఉంచి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అధికారులు.

ఈ నేపథ్యంలో అధికారుల అదుపులో డుంబ్రిగుడ మండల టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ వై.సుబ్బారావు, టిడిపి మాజీ ఎంపీపీ ధనీరావు, కొండబాబు, త్రినాధరావు, ఆంత్రిగూడ గ్రామానికి చెందిన శోభన్, కొర్ర కమల, పాంగి దాసు, లివితిపుట్టు పరిసర గ్రామాలకు చెందిన 10 మంది వరకు ఉన్నట్టు తెలుస్తోంది. వీరందరిని విచారిస్తున్నారు సిట్ అధికారులు. మావోలకు సహకరించడంతో కీలక పాత్ర సుబ్బారావుదే అని నిర్ధారణకు వచ్చిన సిట్ అధికారులు మరింత లోతైన విచారణ జరిపేందుకు ఆయనను పాడేరు తీసుకెళ్లినట్టు సమాచారం. ఇంకో ట్విస్ట్ ఏంటంటే జంట హత్యల తర్వాత జిల్లా టిడిపి ఉపాధ్యక్షుడు పాంగి రాజారావు, ఆయన అనుచరులు మన్యంలో కనిపించట్లేదు. దీంతో ఈ ఘటనలో వారి హ్యాండ్ కూడా ఉందేమో అనే అనుమానంతో పోలీసులు దరీఫతు చేస్తున్నట్టు తెలుస్తోంది.