సివేరి సోమ సంతాప సభలో కిడారి భార్య సెన్సేషనల్ కామెంట్స్

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హతమార్చారు. ఈ ఘటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపింది. వీరి హత్య అనంతరం మావోలపై కసితో రగిలిపోతున్నారు పోలీసులు. ఇప్పటికే ప్రతిదాడిగా ఈ హత్యలో నిందితులుగా ఉన్నఇద్దరు మావోలను హతమార్చారు పోలీసులు. కాగా కిడారి, సోమ హత్యలపై కిడారి సర్వేశ్వరరావు భార్య పరమేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేసారు.

సివేరి సోమ సంతాప సభకు హాజరైన ఆమె, ఈ సభలో ప్రసంగిస్తూ మావోయిస్టులపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… మనం సైలెంట్ గా ఉన్నంత కాలం నక్సల్స్ హత్యలు చేస్తూనే ఉంటారు. నా భర్త ఆదివారం కూడా కుటుంబాన్ని కాదని, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి గ్రామాల్లో పర్యటిస్తూ సమస్యలు తెలుసుకునేవారు. ఎక్కువ సమయం ప్రజలతోనే గడిపేవారు.

అటువంటి సేవాభావం ఉన్న నా భర్తను చంపేశారు. నా భర్తతో పాటు మాజీ ఎమ్మెల్యే సామాను కూడా హత్య చేసారు. వీరిద్దరిని మావోలు ఎందుకు చంపేశారు? అని పరమేశ్వరి ప్రశ్నించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే అందరు మౌనాన్ని వీడాలన్నారు. ధైర్యంగా నోరు విప్పి గట్టిగా సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు.

మనం నిశ్శబ్దంగా ఉంటే ఇటువంటి సంఘటనలు కొనసాగుతూనే ఉంటాయని ఆందోళన వ్యక్తం చేసారు. తప్పుడు సమాచారం ఇచ్చేవారు అటువంటి పనులు మానుకోవాలని ఆమె హెచ్చరించారు. సివేరి సంతాపసభలో మాట్లాడిన ఆమె మొదటిసారి ప్రజల సమక్షంలో తీవ్ర ఉద్వేగంతో తన వేదనను వెళ్లగక్కారు.