ప్రొద్దుటూరు టీడీపీ నేతలకు చంద్రబాబు ఊహించని ఝలక్

ప్రొద్దుటూరు టీడీపీ నేతలపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. కొన్ని రోజుల క్రితం ప్రొద్దుటూరులో 23 మంది టీడీపీ కౌన్సిలర్ల రాజీనామా తీవ్ర సంచలనం రేపింది. ఈ విషయంపై ప్రొద్దుటూరు నేతలతో అమరావతిలో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ విషయంపై వారితో మాట్లాడిన చంద్రబాబు నేతలకు చీవాట్లు పెట్టారు. నేతలే రోడ్డెక్కి ఇలా వ్యవహరిస్తే ప్రజలు అసహ్యించుకుంటారని అన్నారు. సమస్య ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి కానీ వీధికెక్కడం ఏమిటని మందలించారు. త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు. అప్పటివరకు నియోజకవర్గం బాధ్యతలు మంత్రి ఆదినారాయణరెడ్డి చూసుకుంటారని వెల్లడించారు.

మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి, వరదరాజులు రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మున్సిపల్ చైర్మన్ రఘువీరారెడ్డిలతో కూడిన కమిటీని వేస్తున్నామని చెప్పారు. అభ్యర్థిని అనౌన్స్ చేసేవరకు అన్ని వ్యవహారాలు ఈ కమిటీనే నిర్వర్తిస్తుందని తెలిపారు. అధిష్టానానికి ఇంటిమేట్ చేయకుండా కౌన్సిలర్లు రిజైన్ చేయడాన్ని సీఎం తప్పుబట్టారు. కౌన్సిలర్లు అందరూ రాజీనామా చేస్తే కౌన్సిల్ రద్దు అవుతుందని, అప్పుడు అధికారుల పాలన వస్తుందని హెచ్చరించారు. మీరు చెడ్డ పేరు తెచ్చుకుంటే పార్టీకి నష్టం వాటిల్లుతుందని అన్నారు. ఈ అంతర్గత పోరులవల్ల పార్టీ స్థానికంగా బలహీన పడుతుందని, ప్రత్యర్థి పార్టీకి బలం చేకూరుతుందని హెచ్చరించినట్టు సమాచారం. పార్టీకి నష్టం తెచ్చేవారిని మోసే పరిస్థితి లేదని వార్నింగ్ ఇచ్చారు.

అభివృద్ధికి పోటీ పడి పని చేయకుండా వివాదాలు పడితే ప్రజల్లో చులకన అవుతారని హితవు పలికారు. మరోసారి ఇలాంటివి రిపీట్ అవకూడదని, అలా అయితే పార్టీ నుండి తొలగించటానికి కూడా వెనుకాడబోము అని హెచ్చరించినట్టు సమాచారం. ప్రస్తుతం ఇంచార్జి గా ఉన్న వరదరాజులు రెడ్డి స్థానంలో ఐదుగురితో కలిసి కమిటీ వేస్తున్నామని తెలిపారు. ఈ కమిటీ నియోజకవర్గంలో అన్ని వ్యవహారాలు చూసుకుంటుందని అన్నారు. అభిప్రాయాలు కలవనప్పుడు మంత్రి ఆదినారాయణ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

గంటన్నర పాటు ప్రొద్దుటూరు నేతలతో మాట్లాడిన బాబు అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తూనే మాట్లాడినట్టు స్పష్టమవుతోంది. ఒకరిద్దరు మాట్లాడే ప్రయత్నం చేయగా నువ్వు మాట్లాడితే ఇంకొకరు మాట్లాడతారు. ఇప్పుడు ఆ పరిస్థితి మీకు లేదంటూ వారిని నోరు మెదపనియ్యలేదు. మీరు అందించిన వివరాలతో మంత్రి నారాయణ, రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు సమగ్ర నివేదిక ఇచ్చారని మీ గుట్టంతా ఈ కవర్ లో ఉందంటూ ఫైర్ అయ్యారు బాబు.

రాజీనామాలు వెంటనే వెనక్కి తీసుకోవాలని సూచించగా శనివారం ఉదయమే ఉపసంహరించుకున్నట్టు కౌన్సిలర్లు చెప్పారు. అంతకుముందే సీఎం ముఖ్యనేతలు ఒక్కొక్కరితో చర్చించి ప్రొద్దుటూరు వివాదానికి తెరదించేందుకు రాజీమార్గం తెలుసుకున్నారు. కాగా ఈ సమావేశంలో మంత్రి ఆదినారాయణరెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులు రెడ్డి, లింగా రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రఘురామిరెడ్డి, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జడ్పిటిసిలు పాల్గొన్నారు.

కాగా చంద్రబాబు చేసిన కమిటీ ప్రతిపాదనతో వరదరాజులు వర్గానికి, సీఎం రమేష్ వర్గానికి చుక్కెదురైంది. ఆధిపత్య పోరు కోసం పాకులాడుతున్న ఈ నేతలు ఇప్పుడు కచ్చితంగా కలిసే పని చేయాలి. లేదంటే బాబు సీరియస్ యాక్షన్ తీసుకుంటానంటూ ఝలక్ ఇచ్చారు. వరదరాజులుకు వ్యతిరేకంగా రాజీనామాలు చేసిన కౌన్సిలర్ల డిమాండ్ కూడా మట్టిలో కలిసిపోయింది. ఇకనుండైనా సర్దుకుపోయి కలిసి పని చేస్తారో లేదా రెండు కత్తులు ఒకే ఒరలో ఇమడలేవు అని నిరూపిస్తారో వేచి చూడాలి. ఏది ఏమైనా ఇప్పుడు ప్రొద్దుటూరు అంతా ఈ విషయం హాట్ టాపిక్ ఐంది.