ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఊహించని ఝలక్

తాడిపత్రిలో వినాయక నిమజ్జనం సందర్భంగా చెలరేగిన ఘర్షణ తాడిపత్రిలో ఉద్రిక్తతకు దారి తీసింది. ఆశ్రమ భక్తులకు, గ్రామస్థులకు మధ్య చెలరేగిన గొడవ తారాస్థాయికి చేరి ఒకరి హత్యకు కారణమైంది. చిన్న పొలమాడలో జరిగిన సంఘటనతో గ్రామంలో ఉద్రికత్త వాతావరణం నెలకొంది. తాడిపత్రిలో 144 సెక్షన్, 30 యాక్ట్ విధించారు.

తాడిపత్రి పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గ్రామస్థులకు మద్దతుగా ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా జేసీ పోలీసులపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. సహజంగానే నోటి దురుసు ప్రవర్తించే జేసీ దివాకర్ పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో ఇరుక్కున్నారు.

ఆశ్రమం లోని భక్తులు గ్రామస్తులపై రాళ్ళ దాడి చేస్తుంటే ఒక్క పోలీసు కూడా అడ్డుకోవడానికి ముందుకు రాలేదని అన్నారు. ఎస్పీ నుండి ఎస్సై వరకు దాడి జరుగుతుంటే ముందే పారిపోయారంటూ ఎద్దేవా చేసారు. తాడిపత్రిలో పోలీసుల కంటే హిజ్రాలే నయమని, ఆశ్రమం నుండి దాడి చేస్తుంటే అడ్డుకునేందుకు పోలీస్ డిపార్ట్మెంట్ లో మగాళ్లే లేరా అంటూ సంచలన కామెంట్స్ చేశారు.

జేసీ దివాకర్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ పై హిజ్రాలు కన్నెర్ర జేశారు. జేసీకి ఊహించని ఝలక్ ఇచ్చారు. విజయవాడలో జేసీ కి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. తక్షణమే ఆయన బహిరంగంగా హిజ్రాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఓట్ల కోసం తమ వద్దకు వచ్చే టీడీపీ నేతలు తిట్ల కోసం తమని అవమానిస్తున్నారంటూ హిజ్రాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తమ జాతిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన జేసీ తప్పుని ఒప్పుకుని వెంటనే క్షమాపణలు చెప్పకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు హిజ్రాలు. గతంలో చిత్తూరు ఎంపీ శివ ప్రసాద్ హిజ్రా గెటప్ వేసి హిజ్రాల ఆగ్రహానికి గురైన విషయం విదితమే. ఇప్పుడు జేసీ కూడా వారి మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడటంతో టీడీపీ నేతలపై హిజ్రాలు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.