టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు వివాదాలు కొత్తేమి కాదు. వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్ గా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేరు గట్టిగా వినిపిస్తుంది టీడీపీ నేతల్లో. ఇప్పటికే ఆయన పలు వివాదాల్లో ఇరుక్కున్నారు. హమాలీ కార్మికుడిని దాడి చేసి కులం పేరుతో దూషించిన కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఆయన్ని అరెస్టు చేయాలనీ, లేదంటే ఉద్యమాలు జరుపుతామంటూ అఖిలపక్షం హెచ్చరిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కింద ఉంది చదవండి.
హమాలీ కార్మికుడు రాచీటి జాన్ పై దాడి చేసి కులం పేరుతో దూషించారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చింతమనేనిని ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడంపై అఖిలపక్షం ఆందోళన చేపట్టింది. ఇప్టూ కార్యాలయంలో ఆదివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు రాజనాల రామ్మోహనరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతమనేని అరెస్టు కోసం మరో ఉద్యమం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి యు.వెంకటేస్వరరావు, సిపిఎం నగర కార్యదర్శి పి.కిషోర్, సిపిఐ నగర కార్యదర్శి పి.కన్నబాబు, అమానుద్దీన్, ఎంసీపీయూ జిల్లా కార్యదర్శి ఎస్.నాగరాజు, ఏఐటీఆరెఫ్ నాయకులు ఆర్.మణిసింగ్, బేతాళ సుదర్శన్, పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శి కెవి.రత్నం, ఇప్టూ నగర కార్యదర్శి బద్ద వెంకటేశ్వరులు, బాధితుడు రాచీటి జాన్ ఈ సమావేశంలో మాట్లాడారు.
అట్రాసిటీ కేసు నమోదైనా ఇంతవరకు చింతమనేనిని అరెస్టు చేయలేదు. ఆయన్ని అరెస్టు చేయకపోవడంపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసులు చింతమనేనిని అరెస్టు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ నెల 23 వ తేదీన చింతమనేనిని అరెస్టు చేయాలంటూ నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్టు వెల్లడించారు.