తెలుగుదేశంకు అధికారికంగా ఉన్నది 23 మంది ఎమ్మెల్యేలే అయినా అనధికారికంగా నలుగురు వైసీపీతో అంటకాగుతున్నారు. రేపో మాపో ఇంకో ఇద్దరు జంప్ కొడతారనే టాక్ ఉంది. వారిలో గంటా శ్రీనివాసరావు, గణబాబు ఉన్నారు. వీరిని నిలుపుకోవడానికి చంద్రబాబు అష్టకష్టాలు పడుతున్నారు. వెళ్ళిపోయిన వారిని కూడ ఎలాగోలా తిరిగి రప్పించుకోవాలని పరోక్ష మంతనాలు చేస్తున్నారు. ఇలా బాబుగారి దృష్టి మొత్తం ఆ ఐదారుగు ఎమ్మెల్యేల మీదనే ఎక్కువగా ఉంది. ఈ గ్యాప్లో ఇంకొక ఎమ్మెల్యే మెల్లగా పార్టీ నుండి జారుకుంటున్నట్టు చర్చ నడుస్తోంది. ఆయనే ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు. గత ఎన్నికల్లో పార్టీ ఓడినా మంతెన రామరాజు గెలుపొందారు. అది కూడ దాదాపు 11 వేల మెజారిటీతో.
పశ్చిమ గోదావరి జిల్లాలో రాజుల ప్రభావం ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో ఉండి కూడ ఒకటి. మొదటి నుండి ఈ స్థానం టీడీపీకి కంచుకోటల. అక్కడ టీడీపీ తరపున ఎవరిని నిలబెట్టినా నెగ్గుకురాగలరనేది చెలామణిలో ఉన్న మాట. మంతెన రామరాజుకు గత ఎన్నికల్లో టికెట్ దక్కడం పెద్ద విశేషమనే అనాలి. అంతకుముందు అక్కడ వేటుకూరి వెంకట శివరామరాజు అలియాస్ కలవపూడి శివ టీడీపీ నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2009, 2014 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. అయితే గత ఎన్నికలో ఆయన్ను అతి బలవంతం మీద నరసాపురం ఎంపీ స్థానానికి పంపి టికెట్టును మంతెన రామరాజుకు ఇచ్చారు చంద్రబాబు. మంతెన రామరాజు కలవపూడి శివకు శిష్యుడే. అయితే ఎన్నికల్లో మంతెన రామరాజు గెలిచారు కానీ కలవపూడి శివ ఓడిపోయారు. దాంతో ఇదంతా చంద్రబాబుగారి వలనే జరిగిందని, ఉన్నచోటనే ఉండి ఉంటే గెలిచేవాడినని రగిలిపోతున్నారు కలవపూడి.
పైగా నియోజకవర్గంలో చిత్రమైన పరిస్థితులు నడుస్తున్నాయట. ఎమ్మెల్యే మంతెన రామరాజు కాంప్రమైజ్ రాజకీయాలు చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. అక్కడున్న ప్రతి పార్టీలోనూ రాజులే కీలక నేతలుగా ఉన్నారు. పదవులు లేకపోయినా వైసీపీకి అధికారం ఉండటంతో ఆ పార్టీకి చెందిన నేతలే ఉండిలో రాజకీయం నడువుతున్నారట. అన్ని పనులు వారి కనుసన్నల్లోనే జరుగుతున్నాయట. ఎమ్మెల్యే అయ్యుండి కూడ చిన్న పని కూడ చేసుకోలేకపోతున్నానని, అధికారులు వద్ద కూడ మాట చెల్లుబడి కావట్లేదని మంతెన రామరాజు తెగ ఫీలయ్యేవారు. ఫీలై ఫీలై లాభం ఏముంది.. ఏదో ఒకటి చేయాలని అనుకున్నారో ఏమో కానీ చివరికి వైసీపీతో సఖ్యతతో ఉండటం స్టార్ట్ చేశారట. ఈ సఖ్యత ఏనాటికైనా పార్టీకి దెబ్బేనని స్థానిక టీడీపీ శ్రేణులు ఆందోళన పడుతున్నాయట.