ఉండవల్లికి గుడ్ న్యూస్… జీవీరెడ్డి ఫ్రీ అయినట్లున్నారు!

గతకొంతకాలంగా టిడిపి జాతీయ అధికార ప్రతినిధి జీవీరెడ్డి వార్తల్లో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. మార్గదర్శి అక్రమాలకు సంబంధించిన కేసు విషయంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో చర్చకు సిద్ధమనే ఛాలెంజ్ కు స్పందించినప్పటినుంచీ జీవీ రెడ్డి భవితవ్యంపై ఆన్ లైన్ వేదికగా తెగ చర్చలు జరిగాయి. ఇప్పుడు మరోసారి జీవీ వ్యవహారం తెరపైకి వచ్చింది.

అవును గతంలో మార్గదర్శిపై ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ తో డిబేట్‌ కు టీడీపీ నేత జీవీ రెడ్డి గట్టిగానే కసరత్తు చేసినట్లు కనిపించారు. ఒంటికి ఆముధం పూసుకున్న కండలవీరుడి తరహాలో కొన్ని వారాలుగా ఆయన బిల్డప్‌ ఉంటూ వచ్చింది. ఆదివారం డిబేట్‌ కు రావాల్సి ఉండగా శనివారం తాను రాలేనంటూ ఉండవల్లికి మేసేజ్ చేశారు. చెప్పిన కారణం బిజీ షెడ్యూల్‌. ఈ కారణమే చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది.

అయితే నిజంగానే బిజీగా ఉన్నారో.. లేక, అలా చెప్పిన అనంతరం బయట కనిపిస్తే ఉండవల్లి నుంచి ఫోన్ రావడం సంగతి తర్వాత ముందు జనం వెటకారమాడతారని భావించారో కానీ.. కొంతకాలం పాటు జీవీ రెడ్డి కాస్త లోప్రొఫైలే మెయింటైన్ చేసినట్లు కనిపించారు! అయితే ఈ మధ్య కాలంలో మళ్లీ టీవీ డిబేట్ లలో పాల్గొంటున్నారు.

ఇందులో భాగంగా తాజాగా మైకులముందుకు వచ్చిన ఆయన… ప్రజలకు ఇచ్చిన హామీలన్ని నెరవేర్చానని జగన్, ప్రభుత్వంలోని వారు చెప్పడం శుద్ధ అబద్ధం.. పచ్చిమోసం. హామీల సంగతి జగన్ ఎప్పుడో మర్చిపోయాడు. పోనీ అభివృద్ధి గురించైనా మాట్లాడతాడా అంటే అదీలేదంటూ విమర్శలు చేశారు. నాలుగేళ్లలో జగన్ చేసిన అభివృద్ధి శూన్యం అని మండిపడ్డారు. సంక్షేమం పేరుతో ప్రజలకు కోతలు, వాతలే మిగిల్చాడు అని ధ్వజమెత్తారు.

దీంతో కీబోర్డులకు పనిచెబుతున్న నెటిజన్లు.. “ఆ విమర్శల సంగతి సరే కానీ… ఇప్పుడు కాస్త ఫ్రీ అయినట్లున్నారు.. ఉండవల్లికి మెసేజ్ పెట్టండి” అంటూ కామెంట్లు చేస్తున్నారు. “ఉండవల్లి తో డిబేట్ కు సమయం లేని మీకు… టీవీల్లో గంటలు గంటలు డిబేట్ లు, పార్టీ ఆఫీసుల్లో ప్రెస్ కోసం గంటల వెయిటింగులకు సమయం ఉంటుందా” అంటూ ప్రశ్నిస్తున్నారు.

దీంతో సోషల్ మీడియాలో మరోసారి జీవీ రెడ్డి దొరికేశారని తెలుస్తుంది. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే… నాడు ఛాలెంజ్ చేసి.. ఆదివారం నాడు రెడీ కాసోండి అని.. శనివారం రాత్రి “సారీ ఐయాం బిజీ” అని మెసేజ్ పెట్టడం వెనక రామోజీ హస్తం ఉందని అప్పట్లో వార్తలొచ్చాయి. “ఉండవల్లి ముందు నాట్యం చేస్తే నీ పరువు పోవడం సంగతి దేవుడెరుగు, మార్గదర్శి అక్రమాలపై ప్రజలకు మరింత క్లారిటీ ఇచ్చినట్లు అవుతుంది” అని స్వయంగా రామోజీయే రంగంలోకి దిగి జీవీరెడ్డిని ఆపేశారంటూ కథానాలొచ్చాయి.

దీంతో… ఆ కథనాలన్నీ కరెక్ట్ కానిపక్షంలో… కాస్త ఫ్రీగా కనిపిస్తున్న జీవీ రెడ్డి ఏమాత్రం పౌరుషం ఉన్నా ఉండవల్లికి కాల్ చేయాలని, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్లుగా వ్యవహరించి పార్టీ పరువు గంగలో కలపొద్దని టీడీపీ కార్యకర్తలు సూచిస్తున్నారని అంటున్నారు!