వైసీపీ నుంచి జారిపోతున్న ఇద్దరు ఎంపీలు.?

వైసీపీ నుంచి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. కానీ, మంత్రి పదవి రాకపోవడంతో సీన్ మారిపోయింది. అసలు మంత్రి పదవి రాకపోవడానికి కూడా కోటంరెడ్డిలో వచ్చిన ‘మార్పు’ కారణమని వైసీపీ చెబుతుంటుంది.

ఇదిలా వుంటే, నెల్లూరుకే చెందిన మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కూడా వైసీపీ అధినాయకత్వం పట్ల అసహనంతో వున్నారు. మరో వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా వైసీపీని వీడతారన్న ప్రచారం జరుగుతోంది. అయితే, మేకపాటి పార్టీ వీడకపోవచ్చని వైసీపీ వర్గాలంటున్నాయి.

రాజకీయాలన్నాక నాయకులు పార్టీలు మారడం సహజం. పార్టీలు మారేందుకు సిద్ధమైన నేతలపై ఆయా పార్టీలు గుస్సా అవడమూ సహజమే. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద మాజీ మంత్రి పేర్ని నాని సహా పలువురు వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబుకి అమ్ముడుపోయారంటూ కోటంరెడ్డిపై వైసీపీ నుంచి విమర్శలొస్తున్నాయి.

అయితే, కోటంరెడ్డి మాత్రం తనతోపాటు ఇద్దరు ఎంపీల్ని వైసీపీ నుంచి బయటకు తీసుకెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోంది. కోటంరెడ్డికి తెరవెనుక వైసీపీ కీలక నేత ఒకరు సహకరిస్తున్నారట. ఆయనైతే వైసీపీని ఇప్పట్లో వీడే అవకాశం లేదట. ఆయనా మంత్రి వర్గ విస్తరణ సమయంలో గుస్సా అయిన ఎమ్మెల్యేఅనీ.. ఆయన విస్తరణలో పదవి కోల్పోయారనీ అంటున్నారు. మరోపక్క, ఇదంతా టీడీపీ మార్కు మైండ్ గేమ్ అనీ, కోటంరెడ్డి, ఆనం తప్ప ఎవరూ బయటకు వెళ్ళే అవకాశం లేదని వైసీపీ అంటోంది. నిజమేంటో మరి.!