జగన్ కేబినెట్‌లోకి రాబోతున్న ఆ ఇద్దరు నేతలు..!

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన మొదటి మంత్రి వర్గ విస్తరణలో చాలా మందికి చోటు దక్కకపోవడంతో రెండున్నర సంవత్సరాల తరువాత మరో సారి మంత్రివర్గ విస్తరణ చేపడతామని, ఖచ్చితంగా న్యాయం చేస్తామని ఆశావాదులకు సీఎం జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే మొదటి మంత్రివర్గ విస్తరణలో ఎమ్మెల్సీ కోటాలో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలకు సీఎం జగన్ అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే.

అయితే ఇటీవల వారిద్దరు రాజ్యసభకు ఎన్నిక కావడంతో వారు తమ మంత్రి పదవులకు రాజీనామా చేయగా ఏపీ కేబినెట్‌లో రెండు బెర్త్‌లు ఖాళీ అయ్యాయి. దీంతో రెండున్నర ఏళ్ళు పూర్తి కాకుండానే ఆశావాహులలో మరోసారి ఆశలు మొదలయ్యాయి. ఈ నెల 22వ తేదిన జగన్ సర్కార్ మంత్రివర్గ విస్తరణను చేపట్టేందుకు రెడీ కావడంతో సీఎం జగన్ ముందు తమ పేరు ప్రతిపాదించేలా చాలా మంది పోటీపడ్డారు. అయితే ఆ రెండు ఖాళీలపై అదే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతల పేర్లను జగన్ సర్కార్ ఖరారు చేసీనట్టు సమాచారం.

మోపిదేవి వెంకటరమణ స్థానంలో శ్రీకాకుళం జిల్లా, పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పల రాజు, పిల్లి సుభాష్ చంద్రబాస్ స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ పేర్లు దాదాపు ఖాయమైనట్టే కనిపిస్తుంది. అయితే వారికిచ్చే శాఖలలో కూడా ఎలాంటి మార్పులు చేయడం లేదని తెలుస్తుంది. అయితే ఈ ఇద్దరి పేర్లను రేపు అఫిషియల్‌గా ప్రకటించనున్నారు.