సంక్షేమమే ప్రధాన ఎజెండాగా వేల కోట్ల రూపాయలను వివిధ సంక్షేమ పథకాల రూపంలో ప్రజల ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు వైఎస్ జగన్. ఇప్పటికే వీలైన అన్ని చోట్లా అప్పులు చేశారు. ఆ అప్పులకు వడ్డీలు కట్టాలంటే కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి. ప్రభుత్వ నిర్వహణకు కూడా ఖజానాలో నిధులు లేవు. ఈమధ్యే కేంద్రం ఇచ్చిన వెసులుబాటుతో 20 నుండి 30 వేల కోట్ల కొత్త అప్పులను వెతుకుతోంది ఆర్ధిక శాఖ. ఇలా బయట అప్పుల కోసం వెంపర్లాడటం ఎందుకు, కొండంత అండగా ఏడుకొండలవాడు ఉన్నారు కదా అనుకున్నారో ఏమో కానీ ఇప్పడు శ్రీవారి నుండి అప్పు తీసుకోవడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.
శ్రీవారి ఆస్తులు వేల కోట్లలోనే ఉంటాయి. అవి పెరగడమే కానీ తరగడం ఉండదు. కోవిడ్ కారణంగా దర్శనాలు లేక టీటీడీ నష్టాల్లో ఉందని అధికారులు బుకాయించినా అందులో నిజం ఎంతనేది సామాన్యులకు కూడ తెలుసు. శ్రీవారి పేరిట బ్యాంకుల్లో వేల కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. వాటి నుండి 4 శాతం వరకు వడ్డీ ప్రతి నెలా వస్తూనే ఉంటుంది. ఈ డిపాజిట్ల మీదే రాష్ట్ర ప్రభుత్వం కన్నుపడింది. తాజాగా టీటీడీ ఫైనాన్స్ కమిటీ కేంద్ర సెక్యూరిటీల్లో డిపాజిట్లు పెట్టవచ్చని సూచించింది. వారి సూచనకు రాష్ట్ర సెక్యూరిటీలు అనే పదాన్ని జోడించారట టీటీడీ పాలకమండలివారు.
అంటే బ్యాంకుల్లో ఉండే డిపాజిట్లను వాపస్ తీసుకుని, ఇతర నిధులతో కలిపి రాష్ట్ర ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయడం అన్నమాట. ఇలా చేస్తే 7 శాతం వరకు వడ్డీ వస్తుందనేది అధికారుల వాదన. ఇలా చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి భారీ మొత్తంలో శ్రీవారి నుండి అప్పు దొరికినట్టే. ప్రజెంట్ ఉన్న ఆర్ధిక కష్టాల దృష్ట్యా ఆ అప్పులు భారీ మొత్తంలోనే తీసుకునేలా ఉంది ప్రభుత్వం. అప్పు తీసుకుని వాటిని సంక్షేమ పథకాల అమలుకు, ప్రభుత్వ నిర్వహణకు ఖర్చు పెట్టేసుకోవడం సులభమే. కానీ ఆ వేల కోట్లకు నెలకు 7 శాతం వడ్డీ అంటే వీపు వాచిపోతుంది. బయట తెచ్చిన పాత అప్పులకు, ఈ కొత్త అప్పులకు వడ్డీలు చెల్లించాలంటే ఎలాంటి ఆదాయ వనరూ లేని ప్రభుత్వానికి తలకుమించిన భారమే అనాలి. మరి శ్రీవారి వడ్డీల భారాన్ని ఎలా మోయగలమని జగన్ సర్కార్ అనుకుంటుందో చూడాలి.