టిక్కెట్టు కొనుక్కుని దేవుడ్ని దర్శించుకునే దౌర్భాగ్యమేంటి.? అంటూ హిందూ సమాజం ముక్కున వేలేసుకుంటున్నా, ఉచిత దర్శన భాగ్యాన్ని భక్తులకి కల్పించేందుకు సుముఖత వ్యక్తం చేయడంలేదు టీటీడీ. ఏమన్నా అంటే, కరోనా భయం.. అంటోంది. మరి, కరోనా భయం వుంటే, స్కూళ్ళు ఎలా తెరిచినట్లు.? రాజకీయ పరమైన కార్యక్రమాలెలా నడుస్తున్నట్టు.? 300 రూపాయల టిక్కెట్ కొనుక్కుని వెళ్ళే భక్తుడికి కరోనా సోకదా.? ఇలాంటి ప్రశ్నలు తెరపైకొస్తే, సమాధానం మాత్రం టీటీడీ నుంచి దొరకదు. ఎక్కడో లోపం జరుగుతోంది. ఆ లోపాలకీ, తప్పులకీ ఎవరు బాధ్యత వహిస్తారోగానీ, ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇమేజ్ మాత్రం డ్యామేజ్ అయిపోతోంది. తాజాగా, భక్తులకు షడ్రుచులతో కూడిన భోజనాన్ని అందించే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన టీటీడీ మరో వివాదానికి తెరలేపింది. ఈ భోజనాన్ని తక్కువ ధరకే అందిస్తారట.
గో ఆధారిత భోజనమట. సంప్రదాయ భోజనమట. తయారీకి ఎంత ఖర్చవుతుందో, అంతే వసూలు చేస్తారట. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వెళ్ళేవారికి ఆకలి సమస్య వుండదు. ఎందుకంటే, తిరుమల కొండపైకి వెళితే, నిత్యం ఏదో ఒక రూపంలో కడుపు నిండుతుంది.. అదీ ఉచితంగా. అన్న ప్రసాదం కావొచ్చు, ఇతరత్రా ప్రసాదాలు కావొచ్చు.. అన్నీ ఉచితంగానే దొరికే వెసులుబాటు వుంది. మరి, టీటీడీనే ఇలా షడ్రుచుల భోజనం తయారు చేయించి, విక్రయించడమేంటి.? ఈ ప్రశ్న సామాన్యుల మెదళ్ళను తొలిచేస్తోంది. హిందూ దేవాలయాల నుంచి బోల్డంత రాబడి వస్తుంటుంది. దాన్ని భక్తులకు ప్రసాదం రూపంలోనో, సౌకర్యాల రూపంలోనో అందించాల్సిన పాలక మండళ్ళు, భక్తుల్ని నిలువునా దోచేస్తున్నాయన్న ఆవేదన ఈనాటిది కాదు. అసలే, కరోనా నేపథ్యంలో ఉచిత దర్శనాలు నిలిపివేశారాయె. ఇలాంటి సమయంలో ఈ తక్కువ ఖర్చుతో షడ్రుచుల భోజనం.. అంటూ వ్యాపర సూత్రాన్ని తెరపైకి తెస్తే, నష్టం ప్రభుత్వానికే. ప్రజాగ్రహం ప్రభుత్వం మీదకు వెళ్ళేలా టీటీడీ ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నట్టు.?