ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు జిల్లాలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఇలవైకుంఠంగా ప్రఖ్యాతిగాంచింది. ఇక్కడ కొలువై ఉన్న ఏడుకొండలవాడు భక్తుల కోరిన కోరికలు తీరుస్తాడని ప్రజల విశ్వాసం. అందువల్ల ప్రతిరోజు కొన్ని లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో లభించే ఆ శ్రీవారి ప్రసాదమైన లడ్డూలు కూడా ఇక్కడ చాలా ప్రఖ్యాతి పొందాయి. అందువల్ల స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులందరూ వీలైనంత ఎక్కువగా లడ్డూలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే కరోనా కారణంగా శ్రీవారి దర్శనానికి సంబంధించిన టికెట్ల బుకింగ్ తో పాటు స్పెషల్ లడ్డూల కోసం కూడా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవాలని టీటీడీ ప్రకటించింది.
దీనిని ఆసరాగా చేసుకుని కొంతమంది కేటుగాళ్లు శ్రీవారి దర్శనంతో సంబంధం లేకుండానే అధిక లడ్డూల కోసం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఈ వార్తలపై స్పందించిన టిటిడి.. తమ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో లడ్డూలు బుక్ చేసుకోవచ్చనని చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పేసింది. ఇలా ఫేక్ వెబ్ సైట్ ని శ్రీవారి భక్తులు నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో తాజాగా సోమవారం టీటీడీ ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
శ్రీవారిని దర్శించాలని భావించే భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దర్శనానికి సంబంధించిన టికెట్లు బుక్ చేసుకునే సమయంలోనే వారికి కావలసిన అదనపు లడ్డూలు కూడా బుక్ చేసుకుని అవకాశం ఉంటుందని టిటిడి వెల్లడించింది. అంతేకానీ టీటీడీ వెబ్సైట్ అనే ఫేక్ వెబ్ సైట్ ద్వారా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని టీటీడీ వెల్లడించింది. లడ్డూలు విషయంలో చేస్తున్న తప్పుడు ప్రచారాలు గురించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని టీటీడీ వెల్లడించింది.
ఇదిలా ఉండగా జనవరి నెల కు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవ కి సంబంధించిన టికెట్లను తాజాగా విడుదల చేసి భక్తులకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. అంతే కాకుండా డిసెంబర్ 16 వ తేదీ సాయంత్రం నుంచి ధనుర్మాసం ప్రారంభమవటంతో డిసెంబర్ 17వ తేదీ నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.