మాజీ ఎంపీ వివేక్ కు టిఆర్ఎస్ షాక్… తెరపైకి ప్రొఫెసర్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి చూపు పార్లమెంట్ ఎన్నికల పై పడింది. అయితే ఏ స్థానానికి ఎవరు పోటి చేస్తారనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. సీట్ల కేటాయింపు చర్చ ఇప్పటి నుంచే ప్రారంభమైంది. పెద్దపల్లి ఎంపీగా ఉన్న బాల్క సుమన్ చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో పెద్దపల్లి స్థానం మాజీ ఎంపీ వివేక్ కే అని అంతా అనుకున్నారు. కానీ శాసనసభ ఎన్నికలలో వివేక్ పై పలు ఆరోపణలు రావడంతో ఆయనకు ఈ సారి టికెట్ దక్కేది అనుమానమే అని చర్చ జరుగుతోంది.

పెద్దపల్లి ఎంపీ స్థానానికి వివేక్ ను కాకుండా టిఎస్ పీఎస్సీ ఘంటా చక్రపాణి లేదా ఉద్యమకారుడు మల్లేపల్లి లక్ష్మయ్య లను పరిశీలించాలని కేసీఆర్, కేటిఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. 2014 ఎన్నికల సమయంలో నే ఘంటా చక్రపాణిని ఎంపీగా పోటి చేయాలని కోరగా అప్పుడు ఆయన సున్నితంగా తిరస్కరించారట. ఈ సారి కేసీఆర్ నుంచి పిలుపు వస్తే ఘంటా చక్రపాణి ఏ విధంగా స్పందించనున్నారో అనే చర్చ జరుగుతోంది. ఘంట ా చక్రపాణికి ఈ సారి ఎంపీ సీటు పక్కా అని తెలుస్తోంది. 

ఘంటా చక్రపాణి

వివేక్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పని చేశారని పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలంతా కేటిఆర్ కు ఫిర్యాదు చేశారు. ధర్మపురిలో వివేక్ టిఆర్ఎస్ అభ్యర్ధి కొప్పుల ఈశ్వర్ కు అనుకూలంగా కాకుండా ఆయన మాజీ అనుచరుడు అడ్లూరి లక్ష్మణ్ కు అనుకూలంగా పని చేశారనే వాదనలున్నాయి. అందువల్లనే ఈశ్వర్ కు మెజార్టీ తగ్గిందని నేతల అభిప్రాయం. రామగుండంలో  వివేక్ తనకు వ్యతిరేకంగా పని చేయడం వల్లనే ఓటమి పాలయ్యానని సోమారపు సత్యనారాయణ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.

బెల్లంపల్లి నుంచి వివేక్ సోదరుడు గడ్డం వినోద్ ఇండిపెండెంట్ గా పోటి చేశారు. అక్కడ అన్న గెలుపు కోసం  పని చేసి టిఆర్ఎస్ అభ్యర్ది దుర్గం చిన్నయ్య ఓడిపోయేందుకు ప్రయత్నాలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. కానీ అక్కడ టిఆర్ఎస్ అభ్యర్ధి విజయం సాధించారు. మంథనిలో సైతం పెద్దగా పట్టించుకోలేదని వివేక్ సామాజిక వర్గాన్ని టీఆర్ఎస్ వైపు నిలబడే విధంగా చేయలేదని పుట్ట మధు పార్టీ పెద్దల ముందు చెప్పినట్లు సమాచారం. చెన్నురులో పోటీ చేసిన బాల్క సుమన్ కు వివేక్ సహకరించలేదని స్వయంగా సుమన్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.

పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నాయకులు వివేక్ కు వ్యతిరేకంగా ఉండడంతో అక్కడ వివేక్ కు కాకుండా మరోకరికే ఎంపీ సీటు ఇవ్వాలని గులాబీ బాస్ ఓ నిర్ణయానికొచ్చారని తెలుస్తోంది. వివేక్ తీరుపట్ల కేసీఆర్, కేటిఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఆయనకు ఎంపీ సీటు దక్కదన్న చర్చ జోరందుకుంది.