రంగారెడ్డి జిల్లాలో కలకలం రేపుతున్న టిఆర్‌ఎస్ పోస్టర్లు

ప్రగతి నివేదన సభ జరగనే జరుగలేదు కానీ ప్రగతి నివేదన సభ విజయవంతం అయినట్టు, విజయవంతం చేసిన కార్యకర్తలకు, నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఆ పోస్టర్ ను చూసిన ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే పేరుతో సభ విజయవంతం అయిందని ధన్యవాదాలు తెలుపుతూ ఏర్పాటు చేశారు. ఈ పోస్టర్లు రంగారెడ్డి జిల్లాలోని బొంగ్లూరు గేట్ దగ్గర వెలిశాయి.

సెప్టెంబర్ 2న కొంగరకలాన్ లో 25 లక్షల మంది కార్యకర్తలతో ప్రగతి నివేదన సభను టిఆర్ ఎస్ పార్టీ నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభ విజయవంతం కోసం సీఎం కేసీఆర్ నేతలందరికి ఇప్పటికే దిశా నిర్ధేశం చేశారు. నాయకులంతా కూడా సభ విజయవంతం కోసం తమ తమ నియోజక వర్గాల్లో మునిగిపోయారు.

అయితే ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పేరుతో కొన్ని బ్యానర్లు వెలిశాయి. ప్రగతి నివేదన సభను విజయవంతం చేయాలని కోరే బదులుగా ప్రగతి నివేదన సభను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ బ్యానర్ ను ఏర్పాటు చేశారు. దీనిని చూసిన ప్రజలంతా నవ్వుకుంటున్నారు. సభే జరగలేదు అప్పుడే విజయవంతం అయ్యినట్టు బ్యానర్లు పెట్టారని వీళ్లదేం తెలివని అంతా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ బ్యానర్ కింద ఉంది మీరే చూడండి. ఫోటో సోషల్ మీడియాలో వైరలూ కావడంతో తొలగించారు.