తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, నిజామాబాద్ టిఆర్ ఎస్ ఎంపీ కవిత రూట్ మార్చారా? లేకపోతే ఇప్పుడున్న రూట్ లోనే దూసుకుపోతారా? 2019 లో ఎంపి కవిత అడుగులు ఎటువైపు? అసలు ఆమె ఎక్కడ పోటీ చేస్తారు? పూర్తి వివరాల కోసం చదవండి ఈ స్టోరీ.
ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా ఉన్న కవిత దేశ రాజకీయాలపైనే పూర్తి స్ధాయిలో దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని ప్రకటించినప్పటి నుంచి ఆమె జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ మమతాబెనర్జీని కలిసినప్పుడు కోల్ కతాకు వెళ్లారు కవిత. ఆ తర్వాత డిఎంకే నేతలను కలిసినప్పుడు కూడా కవిత చెన్నై వెళ్లారు. కేసీఆర్ తో పాటుగా కవిత కనిమొళిని కలుసుకున్నారు. జాతీయ రాజకీయాలలో చురుకుగా పాల్గొనేందుకే ఆమె జాతీయ స్థాయిలో పార్టీలతో పరిచయాలు పెంచుకుంటున్నారు. అలాగే టిఆర్ ఎస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బిజెపితో వైరం లేకుండా స్నేహంతోనే గడుపుతుంది. 2019 ఎన్నికల్లో కీలక పదవి పొందాలనే దిశగా కవిత పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.
వాస్తవానికి గత కొద్ది రోజులుగా కవిత జగిత్యాల నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటి చేస్తారని వార్తలు వచ్చాయి. తన భర్త అనిల్ రావును నిజామాబాద్ ఎంపీగా పోటి చేయించే ఆలోచనలో ఉన్నారని టాక్ నడిచింది. జగిత్యాల నుంచి పోటీ చేసి రాష్ట్ర మంత్రి వర్గంలో చేరాలన్న ఆలోచనతో ఉన్నట్లు నిజామాబాద్ పాలిటిక్స్ లో టాక్ నడిచింది. అసలే తెలంగాణ కేబినెట్ మహిళల భాగస్వామ్యం లేకుండా ఉంది. దీంతో కేబినెట్ లో తొలి మహిళా మంత్రిగా కవిత రికార్డు నెలకొల్పే అవకాశాలున్నాయని గులాబీ వర్గాల్లోనూ చర్చ నడిచింది. ఈ క్రమంలోనే నిజామాబాద్ లో కొరకరాని కొయ్యగా మారిన డిఎస్ కు కవిత చెక్ పెట్టినట్టుగా కథనాలు వచ్చాయి. డిఎస్ లాంటి సీనియర్ నేతకు కవిత చెక్ పెట్టడం పెద్ద చర్చనీయాంశమే అయ్యింది. ఆ తర్వాత కవిత జగిత్యాల నుంచి పోటి చేస్తారని అదే సమయంలో కవిత, జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇద్దరు ఒకే వాహనంలో ప్రయాణించడంతో కవిత నిజంగానే జగిత్యాల నుంచి పోటి చేస్తారేమో అందుకే జీవన్ రెడ్డి తో చర్చలు జరిపారని అంతా అనుకున్నారు. ఇలా జగిత్యాల నుంచి పోటి చేస్తానని కవితే కావాలని ప్రచారం చేసుకున్నారని, ప్రతిపక్షాల దృష్టి మరల్చేందుకే కవిత ఈ విధంగా చేస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి.
2019 సాధారణ ఎన్నికల్లో కేంద్రంలో హంగ్ వస్తుందని కవిత అంచనాల్లో ఉన్నారని చెబుతున్నారు. అప్పుడు టిఆర్ ఎస్ అవసరం తప్పనిసరి అవుతుందని ఆమె భావిస్తున్నారట. అప్పుడు టిఆర్ఎస్ మద్దతు అనివార్యమవుతుందని, తద్వారా టిఆర్ఎస్ కు ఎక్కువ మంత్రి పదవులు తీసుకోవడంతోపాటు జాతీయ స్థాయిలో చక్రం తిప్పే అవకాశం కూడా దక్కుతుందన్న భావనలో కవిత ఉన్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా రానున్న ఎన్నికల తర్వాత తెలంగాణ నాయకులే జాతీయ రాజకీయాలు చేస్తారంటూ కవిత తన మనసులో మాటలను ఇటీవల సభల్లో బయటపెట్టారు కూడా. ఇక నిజామాబాద్ లో డిఎస్ తన కొడుకు అర్వింద్ కు మేలు చేకూర్చే విధంగా ఎత్తుగడలు వేస్తున్నట్లు పసిగట్టి కవిత ఆ విధంగా వ్యవహరించారని వారు తెలుపుతున్నారు. అందుకే బిజెపితో వైరం లేకుండా, కాంగ్రెస్ తో దోస్తి లేకుండా నిశితంగా టిఆర్ ఎస్ అడుగులు వేస్తుంది. మొత్తానికి 2019లో కేంద్రమంత్రి అయ్యే దిశగా పావులు కదుపుతున్నారు ఎంపి కవిత.