ప్రస్తుత కాలంలో విద్యా వైద్యం కూడా వ్యాపారంలా మారిపోయింది. విద్యార్థులకు చదువు చెప్పటానికి కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు లక్షల రూపాయలలో ఫీజులు వసూలు చేసి చదువుని వ్యాపారంగా మార్చేశారు. అలాగే వైద్య రంగం కూడా ఇప్పుడు ఒక వ్యాపారంలో మారిపోయింది. ప్రైవేట్ హాస్పిటల్స్ లో డబ్బుకు ఇస్తున్న విలువ మనుషుల ప్రాణాలకు ఇవ్వటం లేదు. ఈ క్రమంలో రోగులు ప్రాణాపాయ స్థితిలో ఉన్న కూడా డబ్బు కడితేనే కానీ వైద్యం అందించడం లేదు. స్టాలిన్ సినిమాలో చూపించిన విధంగా చనిపోయిన వారి డెడ్ బాడీలతో కూడా ప్రైవేట్ హాస్పిటల్ వారు వ్యాపారం చేస్తున్నారు. డబ్బు కడితేనే కానీ శవాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వడం లేదు.
తాజాగా ఇటువంటి ఘటన ఖైరతాబాద్ లో చోటు చేసుకుంది. 60 వేల రూపాయలు బిల్లు కట్టనందుకు చిన్నారిని తల్లిదండ్రులకు ఇవ్వకుండా ఆసుపత్రి యాజమాన్యం వారు డబ్బు డిమాండ్ చేసిన ఘటన సైబాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇటీవల ఆరు సంవత్సరాల చిన్నారికి అనారోగ్యంగా ఉండటం వల్ల తల్లిదండ్రులు నాలుగు రోజుల క్రితం లోటస్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి వైద్యం వికటించి శనివారం రాత్రి మృతి చెందింది.
చిన్నారి వైద్యం కోసం ఆసుపత్రి యాజమాన్యం వారు 3 లక్షల 60 వేల రూపాయల బిల్లు వేశారు. చిన్నారి కుటుంబ సభ్యులు మూడు లక్షల రూపాయలు చెల్లించారు. ఆదివారం ఉదయం చిన్నారి మరణించిన విషయం తల్లిదండ్రులకు తెలియజేసిన ఆసుపత్రి యాజమాన్యం 60 వేల రూపాయలు కడితేనే చిన్నారి మృతదేహాన్ని ఇస్తామని తెలిపారు. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు తమ కూతురు చనిపోయిన విషయాన్ని కూడా తమకి చెప్పకుండా కేవలం డబ్బు కోసం పాకులాడుతున్నారని బంధువులతో కలిసి ఆసుపత్రి ముందు నిరసన తెలియజేశారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.