తెలంగాణలో అధికార టిఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నట్లు చెబుతున్నారు సర్కారు పెద్దలు. అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో తమదే ఆధిపత్యం అని ఢంకా భజాయించి చెబుతున్నారు. కానీ అన్ని గ్రామాల్లో ఆ పరిస్థితి మాత్రం లేదనే చెప్పాలి. ఎందుకంటే కొన్ని గ్రామాల్లో స్థానిక పరిస్థితులు వేరే రకంగా ఉన్నాయి. అలాంటి గ్రామమే ఇది. ఈ ఊరి పేరు ఉప్లూరు. మండలం కమ్మర్ పల్లి, నియోజకవర్గం బాల్కొండ, జిల్లా నిజామాబాద్. ఈ ఊరి కథేంటో కింద చదవండి.
దేశమంతా వర్సాలు పడుతున్నాయి. తెలంగాణలోనూ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులు నిండిపోయాయి. దీంతో అన్నదాతల రిలాక్స్ అయ్యారు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీ రాం సాగర్ కూడా నిండిపోయింది. కానీ గత పదిహేను రోజుల కిందటి వరకు వర్షాలు లేకపోవడంతో వేసిన పంటలు ఎండిపోయి రైతులు ఆగమాగమైర్రు. ఆ సమయంలో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాం సాగర్ ప్రాజెక్టు కింద గ్రామాల రైతులు ఎప్పటి లాగే లీకేజీ వాటర్ విడుదల చేయాలని ఆందోళన చేశారు. జూన్, జులైలోనే పంటలు వేసుకుంటారు కాబట్టి కొద్దిరోజులు నీళ్లు ఇస్తే తర్వాత వర్షాలు వచ్చి తమ పంటలు గట్టెక్కుతాయని రైతులు వేడుకున్నారు. కానీ ప్రభుత్వం ససేమిరా అన్నది.
నీళ్లు ఇచ్చే పరిస్థితే లేదని తేల్చి చెప్పింది. గ్రామస్థులు స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావును కలిసి అడగండి అని ఎమ్మెల్యే సూచించారు. దీంతో వారు హైదరాబాద్ వచ్చి మంత్ హరీష్ రావును కలిశారు. కానీ నీళ్లు మాత్రం విడుదల కాలేదు. దీంతో కడుపు మండిన రైతులు ఆందోళన చేశారు. రోడ్డు మీద రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. ఆ సమయంలో కొన్ని బస్సుల అద్దాలు పగిలిగిపోయాయి. దీంతో విధ్వంసం చేసిన కేసుల్లో కొందరు రైతులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ లీకేజీ వాటర్ కేవలం ఉప్లూరుకే కాకుండా మరికొన్ని గ్రామాల్లో రైతులకు కూడా మేలు చేకూరుతుందని గ్రామస్థులు చెబుతున్నారు.
ఇక తెలంగాణ ప్రభుత్వం తమ గోడు ఏమాత్రం పట్టించుకోలేదు కాబట్టి ఉప్లూరు గ్రామస్థులంతా ఇకనుంచి టిఆర్ఎస్ జరిపే ఏ సభలకు కూడా హాజరు కావొద్దని ఏకగ్రీవ తీర్మానం చేశారు. టిఆర్ఎస్ ను బహిష్కరించారు. తమ గోడు పట్టించుకోని పార్టీకి తామెందుకు సహకరించాలని వారు గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఉప్లూరు లో ఇంతటి కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపిటిసి ఎనగందుల వీణ శైలేందర్ ‘తెలుగురాజ్యం’ తో వివరించారు. ఆమె చెబుతున్న వివరాలు ఇవి.
‘‘ఉప్లూరు గ్రామంలో సుమారు 5వేల జనాభా ఉంది. ఎక్కువ మంది వ్యవసాయం మీదనే బతుకుతున్నరు. జూన్, జులైలోనే పంటలు వేసుకున్నాం. ఎప్పుడైనా అలాగే వేస్తాం. అప్పుడు ఎప్పుడైనా నీళ్లు తక్కువ పడితే శ్రీరాంసాగర్ లీకేజీ నీళ్లు వదిలిపెట్టేవారు. గతంలో మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి హయాంలో అయినా, మొన్న ఈరవత్రి అనీల్ హయాంలో అయినా ఫోన్ చేస్తే నీళ్లు ఇడిచిపెట్టేవారు. టిఆర్ఎస్ నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నీళ్లు వదిలిపెట్టారు. అది కూడా రైతులంతా పోయి ఆందోళన చేస్తేనే ప్రశాంత్ రెడ్డి నీళ్లు ఇప్పించిండు. కానీ ఈసారి మాత్రం చుక్క నీరు ఇడిచిపెట్టలేదు. వాళ్లు చెప్పేదేందంటే మిషన్ భగీరథ కింద మంచినీళ్లు ఇయ్యాలంటే సరిపోవు. అందుకోసం నీళ్లు ఇడిచిపెట్టం అన్నారు. మా ఊరే కాదు మెట్ పల్లి నియోజకవర్గంలోని వెల్లుల్ల, జక్కాసాగర్ గ్రామాలకు కూడా లీకేజీ వాటర్ వదిలేవారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీవ్ర కరువు ఉన్నా కూడా మాకు లీకేజీ వాటర్ వదిలారు. అప్పుడు తెలంగాణలో కరువున్నా.. ఎగువన మహారాష్ట్రలో వర్షాలు కురిసేవి. ప్రాజెక్టులోకి నీరు వచ్చేది. దీంతో మాకు నీటి సమస్య రాలేదు. పంటలు ఆరంభంలో ఒకసారి వదిలేవారు. తర్వాత వర్షాలు రాకపోతే పంట చేతికొచ్చే సమయంలో కూడా నీళ్లు వదిలేవారు. ప్రాజెక్టు కట్టినప్పటి నుంచే నీళ్లు ఇలా వదిలే ఆనవాయితీ ఉంది. ఎలాగూ వర్షాలు వస్తాయి.. మాకు నీళ్లు వదిలిపెట్టురి అని ఎంత బతిలాడినా వదలలేదు. ఎమ్మెల్యేను కలిసినం. మంత్రి హరీష్ రావును కలిసినం అయినా నీళ్లు మాత్రం రాలే. మిషన్ భగీరథకు సరిపోవన్న ముచ్చటతోనే నీళ్ళు రానీయలేదు.
ఇగ నీళ్లు ఇచ్చుడు లేకపోగా మా ఊరిలో 144 సెక్షన్ పెట్టిర్రు. 300 మంది పోలీసులు వచ్చి10 రోజులు మా ఊరిలోనే మకాం వేసి గస్తీ కొట్టిర్రు. ఇదంతా చేసే సరికి మాకు కడుపు మండింది. టిఆర్ఎస్ మీటింగులకు పోవద్దని ఊరంతా మీటింగ్ పెట్టుకుని నిర్ణయం చేసినం. ఆ సమయంలోనే ఆగస్టు 18వ తేదీన భీంగల్ లో కేటిఆర్ సమావేశం ఏర్పాటైంది. ఆ సమావేశానికి ఎవరూ పోవద్దని అంతుముందు రోజు 17వ తేదీన నిర్ణయం జరిగింది. కానీ మాజీ ప్రధాని వాజ్ పాయి చనిపోవడంతో భీంగల్ లో కేటిఆర్ మీటింగ్ క్యాన్సల్ అయింది. తర్వాత వర్షాలు కూడా బాగ కురిసినయ్’’.
ఇప్పుడెట్ల ఉంది పరిస్థితి??
ఈ విషయమై గ్రామస్థులు చెబుతున్న విషయమేమంటే? ఇప్పుడు వర్షాలు కురిసినయ్ కాబట్టి ఎవరి పని వారు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. అప్పుడు కోపంతో ఉండబట్టి ఆగస్టు 18వ తేదీన కేటిఆర్ సభకు మాత్రమే మేమంతా పోవొద్దు అనుకున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో ఈ తీర్మానం పట్టింపు ఉండొచ్చు ఉండకోవచ్చని అంటున్నారు. తీర్మానమైతే అప్పటి వరకే చేసినం అని చెప్పారు. ఇప్పుడు నీళ్ల సమస్య లేదు కాబట్టి రానున్న రోజుల్లో జరిగే టిఆర్ఎస్ సభలకు పోవాలా వద్దా అన్నదాని మీద ఇంకా ఎలాంటి చర్చలు, నిర్ణయాలు జరగలేదన్నారు.
మొత్తానికి ఇప్పుడు ఉప్లూర్ అనే గ్రామం తెలంగాణ జిల్లాల్లో సంచలనంగా మారింది.