మిర్యాలగూడ ప్రణయ్ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని నకిరేకల్ తాజా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేషం స్పష్టం చేశారు. ఓ టివి ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. అసలు మారుతీరావు ఎవరో తనకు తెలియదన్నారు.
మిర్యాలగూడలో వైశ్య గర్జన సభ అయితే జిల్లా ప్రజాప్రతినిధులను అందరిని పిలిచారని అందరితోపాటు నేను కూడా వెళ్ళానన్నారు. తనది కూడా ప్రేమ వివాహమేనని తానేందుకు ప్రేమ వివాహాన్ని వ్యతిరేకిస్తానని ప్రశ్నించారు. ఒక దళిత బిడ్డ ప్రేమ పెళ్లి చేసుకుంటే వ్యతిరేకించేంత నీచ స్థితికి వీరేషం దిగజారలేదన్నారు. అమృత నిజా నిజాలు తెలుసుకొని అర్ధం చేసుకోవాలన్నారు. తెలిసిన వాళ్లు కూడా అమృతకు చెబితే బాగుంటుందని వీరేషం అన్నారు.
బీహారి గ్యాంగ్ తో మాట్లాడానని అమ్మాయి చెప్పిందని అసలు తనకు తెలుగు తప్ప ఏ భాష రాదని తానెలా బీహారిలతో మాట్లాడుతానన్నారు. తాను కమ్యూనిష్టు ఉద్యమాల నుంచి వచ్చానని తన వివాహం కూడా పార్టీనే చేసిందని తెలిపారు. ప్రేమ పెళ్లిలకు వీరేషం వ్యతిరేకం కాదని తెలిపారు. ఎక్కడ ఏం జరిగినా వీరేషం అనే పేరు తీసుకురావడం పరిపాటైందని వాస్తవాలు తెలుసుకోని మాట్లాడాలని వీరేశం అన్నారు.
పెద్దలు కూడా పిల్లలు మేజర్ అయ్యాక వారి వివాహ నిర్ణయాన్ని వారికి వదిలేస్తే బాగుంటుందని సూచించారు. పిల్లలు కూడా తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించి చేసుకోవాలన్నారు. ఏదేమైనా అమృతకు జరిగింది అన్యాయమేనని అన్ని విధాలుగా మానవతా దృక్పధంతో అమృతను ఆదుకుంటామని ప్రభుత్వం తరపున కూడా సహాయం అందించేందుకు తన వంతు కృషి చేస్తానని వీరేషం అన్నారు.
మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్యలో వీరేశం పాత్ర కూడా ఉందని అమృత ఆరోపించింది. వీరేషం అంకుల్ సెటిల్ చేసుకుందాం రమ్మని ఫోన్ కాల్ చేశారని వెళ్లకపోతే నకిరేకల్ పోలీస్ స్టేషన్ లో ప్రణయ్ నాన్న మీద కేసుపెట్టి వేధించారని ఆరోపించింది. ఇదే విషయం పై ఐజీ స్టీపెన్ రవీంద్రను కలిసి విన్నవించుకోవడంతో కేతేపల్లి ఎస్ ఐకి మోమొ జారీ చేశారని అప్పటి నుంచి వేధింపులు ఆగిపోయాయని అమృత తెలిపింది.
తన తండ్రి పెద్ద రౌడి అని అతనికి అందరితో సంబంధాలున్నాయని అతనిని చంపేయాలని అంది. తనకు , పుట్టబోయే బిడ్డకు , ప్రణయ్ కుటుంబ సభ్యులకు ప్రాణ హాని ఉందని తమను కూడా చంపేస్తారని అమృత ఆందోళన వ్యక్తం చేసింది. వీరేశం మీద ఆరోపణలు రుజువైతే అతనిపై కూడా విచారిస్తామని ఎస్పీ రంగనాథ్ మీడియాకు తెలిపారు. ఇప్పటి వరకైతే ఏ ప్రజాప్రతినిధి ఇందులో లేరన్నారు.
ఈ నేపథ్యంలో తన పై వచ్చిన ఆరోపణలకు వీరేషం ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో వీరేషం మాట్లాడుతూ చాలా స్పష్టంగా తనకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. దీంతో కేసు విచారణ సమయంలో ఎటువంటి మలుపులు తిరగనుందో అనే చర్చ మొదలైంది.