యాదాద్రి జిల్లాలో విషాదం

తండ్రి మరణాన్ని తట్టుకోలేక కొడుకు గుండె ఆగింది. మరణంలో సైతం నీవెంటే అంటూ  ఆ కొడుకు మరణించడంతో ఆ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. ఈ హృదయ విదారక ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురంలో జరిగింది.

లక్ష్మాపురం గ్రామానికి చెందిన బత్తుల అయ్యన్న (78) గీత కార్మికునిగా పనిచేస్తుండేవాడు. వృద్దాప్యంలోకి చేరుకోవడంతో అనారోగ్య సమస్యలతో గురువారం అయ్యన్న మరణించాడు. అయ్యన్నకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు ఆంజనేయులు రామన్నపేటలో నివాసముంటూ వ్యాపారం చేసుకుంటున్నాడు. చిన్న కొడుకు వెంకటేశం బట్టలు కుట్టుకుంటూ గ్రామంలోనే  ఉంటున్నాడు.

మృతదేహాల వద్ద రోధిస్తున్న కుటుంబ సభ్యులు

తండ్రి మరణ వార్త తెలుసుకున్న ఆంజనేయులు గ్రామానికి వచ్చి ఏడుస్తూ మానసికంగా కుంగిపోయాడు. చిన్నతనంలో తన తండ్రితో గడిపిన జ్ఞాపకాలను తలుచుకుంటూ రోధించాడు. తెల్లవార్లు అలా ఏడుస్తూనే ఉన్నాడు. గ్రామస్థులు, బంధువులు ఓదార్చినా ఆంజనేయులు ఊరుకోలేదు.

శుక్రవారం ఉదయం ఆంజనేయులు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అందరూ ఆంజనేయులును ఆసుపత్రికి తరలించగా అతను గుండెపోటుతో అప్పటికే చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. దీంతో అంతా విషాదంలో మునిగిపోయారు. తండ్రి కొడుకులు ఇద్దరూ ఓకేసారి మరణించడంతో గ్రామంలో, కుటుంబసభ్యుల్లో తీరని విషాదం నెలకొంది. చూసిన వారంతా కంటతడిపెట్టి అయ్యో అనుకున్నారు.