రాజధాని లేకపోతే వైఎస్ జగన్‌కి ముందు ముందు కష్టకాలమే.!

అమరావతినే రాజధానిగా కొనసాగిస్తారో.. లేదంటే, రానున్న రెండేళ్ళలో విశాఖపట్నం నగరాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా, కర్నూలుని జ్యుడీషియల్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దుతారోగానీ.. ఖచ్చితంగా 2024 ఎన్నికల్లోపే.. అంటే, మరో ఏడాదిలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ నిర్ణయానికి వచ్చేసి, వాటిని పూర్తిచేసెయ్యాల్సి వుంటుంది.

ఏకైక రాజధాని అమరావతి కోసం లక్ష కోట్లు ఖర్చు చేయలేం.. రాష్ట్రంలో మూడు రాజధానుల్ని అభివృద్ధి చేస్తాం.. అంటూ వైఎస్ జగన్ సర్కార్ చెబుతోన్న మాట కొంత మేర సబబుగానే వున్నా, ఒకటీ లేదు.. మూడూ లేవు.. అనే భావన, అత్యంత ప్రమాదకరం.

మూడు రాజధానుల వ్యవహారానికి సంబంధించి న్యాయస్థానాలు ఎప్పటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారన్నది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల క్వశ్చన్. ఎన్నికల నాటికి కూడా ఇదే పరిస్థితి వుంటే, ప్రజలకు సమాధానం చెప్పుకునే అవకాశమే వుండదు వైఎస్ జగన్ సర్కారుకి. అప్పుడు కల్లబొల్లి కబుర్లు చెబుతామంటే కుదరదు. విపక్షాల మీదనో, కోర్టుల మీదనో నిందలేస్తామంటే అసలే కుదరదు.

మూడు రాజధానుల విషయంలో ముమ్మాటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎవరో తప్పుదోవపట్టిస్తున్నారు. లేకపోతే, అమరావతి రాజధానిగా పరిపాలన సాగిస్తూ, అక్కడ ఒక్క కొత్త అధికారిక భవనాన్నీ జగన్ హయాంలో నిర్మితం చేయలేకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?

హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత సంక్షేమ పథకాలు అధికారాన్ని కాపాడలేవనే విషయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా తెలుసుకుని వుండాలి. బద్వేలు ఉప ఎన్నిక, తిరుపతి ఉప ఎన్నిక జరిగిన తీరు వేరు, వాటి నేపథ్యం వేరు. ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది. రాజధాని సహా చాలా అంశాల విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్పష్టత కావాలి. ఆ స్పష్టత ఇవ్వలేని పరిస్థితి వైసీపీకి ఖచ్చితంగా ఇబ్బంది తెచ్చిపెడుతుంది.