అమరావతి రైతులకు అండగా పరాశరన్.. ప్రభుత్వంలో గుబులు

Kesava Parasaran
పరాశరన్.. ఈయన పేరు ఈమధ్య బాగా పాపులర్ అయింది.  దశాబ్దాల తరబడి సుప్రీం కోర్టులో నలిగిన అయోధ్య రామ మందిర నిర్మాణం కేసులో సుధీర్ఘ కాలం వాదనలు వినిపించి రామ మందిరం కల సాకారం అవ్వడంలో ప్రముఖ పాత్ర పోషించారు.  తమిళనాడుకు చెందిన పరాశరన్ గతంలో రెండుసార్లు భారత అటార్నీ జనరల్ బాద్యతలను నిర్వర్తించారు.  న్యాయశాస్త్ర కోవిదుడిగా ఆయనకు గొప్ప పేరుంది.  సుప్రీం కోర్టు ధర్మాసనానికి సైతం పరాశరన్ అంటే ప్రత్యేక గౌరవం ఉంది. అయోధ్య వాదనలు వినిపించే సమయంలో వయసు రీత్యా కూర్చుని వాదించవచ్చని ధర్మాసనం ఆయనకు తెలిపింది.  కానీ పరాశరన్ ధర్మాసనం ఇచ్చిన వెసులుబాటును సున్నితంగా తిరస్కరించి నిలబడే వాదనలు వినిపించారు.  అంత గొప్ప న్యాయవాది ఆయన. 
 
Kesava Parasaran
ఆయనే ఇప్పుడు అమరావతి రైతుల కేసును వాదించడానికి అంగీకరించారు.  రాజధాని మార్పు, కార్యాలయాల తరలింపు విషయంలో హైకోర్టులో ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బలే తగిలాయి.  మార్పుపై కోర్టు స్టేటస్ కో విధించింది.  ఆ మధ్యంతర ఉత్తర్వులను పొడిగించరాదని, ఉత్తర్వుల మీద స్టే ఇవ్వాలని సుప్రీం కోర్టుకు వెళ్లినా కూడా హైకోర్టు విచారణ సరిగ్గానే ఉందని, విచారణ ముగిసేవరకు తాము జోక్యం చేసుకోలేమని తేల్చింది.  మూడు రాజధానుల విషయంలో ఎలాగైనా పైచేయి సాధించాలని అనుకుంటున్న ప్రభుత్వం హరీశ్ సాల్వే లాంటి ప్రముఖ లాయర్ ద్వారా వాదనలు వినిపిస్తోంది.  
 
హరీశ్ సాల్వేను తట్టుకుని కేసును గెలవాలి అంటే రైతుల తరపున కూడా అదే స్థాయి లాయర్ ఉండాలి.  ప్రభుత్వం అంటే కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి హరీశ్ సాల్వేను పెట్టుకుంది.  కానీ రైతులు అంత పెద్ద మొత్తంలో ఫీజులు చెల్లించలేరు.  అందుకే వారంతా కలిసి లాయర్ పరాశరన్ వద్దకు చేరుకుని తమ బాధ విన్నవించుకున్నారు.  వారి బాధను విన్న పరాశరన్ కేసును టేకప్ చేశారు.  ఇందుకుగాను ఆయన లక్షల రూపాయల ఫీజు కోరలేదు.  కేవలం 1 రూపాయితో కేసును వాదిస్తున్నారని వినికిడి.  ప్ర‌స్తుతం ఆయ‌న త‌రుపున ఆయ‌న కుమారుడు మోహ‌న్ ప‌రాశ‌ర‌న్ అమ‌రాతి వివాదంపై రైతుల త‌ర‌పున వాద‌న‌లు వినిపిస్తున్నారు.  రెండు రోజుల కిత్రం అమ‌రావతిపై జ‌రిగిన వాద‌న‌ల్లోనూ ప‌రాశ‌రన్ పాల్గొన్నారు.  పరాశరన్ ఎంట్రీతో గెలుపుపై రైతుల్లో ధీమా పెరిగింది.  అలాగే ప్రభుత్వానికి కోర్టుల్లో టఫ్ ఫైట్ కూడా మొదలైంది.