ఆ 25 సీట్లు చంద్రబాబు ఏ పార్టీకిస్తారో తెలుసా ?

చంద్రబాబునాయుడు తాజాగా చేసిన వ్యాఖ్యలపై  తెలుగుదేశంపార్టీలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. పార్టీ నేతలతో  జరిగిన టెలికాన్ఫరెన్సులో చంద్రబాబు మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో పార్టీ 25 ఎంపి సీట్లలోను, 150 అసెంబ్లీల్లోను గెలిచి తీరాలని ఆర్డర్ వేశారు. ఇక్కడే అందరిలోను అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే, మొన్నటి వరకూ పులివెందులలో కలిపి మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో టిడిపినే గెలవాలంటూ ఓ వెయ్యి సార్లు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. సరే చంద్రబాబు అనుకుంటున్నట్లు 175 పార్లమెంటు సీట్లు, 25 ఎంపి సీట్లలో టిడిపి గెలుస్తుందా లేదా అన్నది వేరే సంగతి. అయితే ఏ పార్టీ అయినా అన్నీ సీట్లలో తామే గెలవాలని అనుకోవటంలో తప్పు మాత్రం లేదు.

 

కానీ తాజాగా చంద్రబాబు చెప్పిన సీట్ల సంఖ్య మీదే అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే, తనంతట తానుగా గెలవాల్సిన సీట్ల సంఖ్యను 175 నుండి 150కి చంద్రబాబే ఎందుకు తగ్గించుకున్నట్లు ? అంటే తగ్గుతున్న 25 సీట్లలో చంద్రబాబు లెక్క ప్రకారం ఎవరు గెలుస్తారు ? చంద్రబాబు వైఖరి తెలిసిన వారెవరూ ప్రతిపక్షాలు కూడా ఓ పది సీట్లలో గెలవాలని కోరుకునే వ్యక్తిగా అనుకోరు. ఎందుకంటే, రాష్ట్రంలో అసలు ప్రతిపక్షమే ఉండకూడదని కోరుకునే వ్యక్తి చంద్రబాబు. తనకు అధికారం లేదుకానీ ఉండుంటే ఈ పాటికే రాష్ట్రంలో ప్రతిపక్షాలను బ్యాన్ చేసుండేవారనటంలో సందేహమే లేదు.

 

అవకాశం ఉన్నంతలో ప్రధాన ప్రతిపక్షమైన వైసిపిని చీల్చి చెండాడాలని అనుకున్న వ్యక్తి చంద్రబాబు. జగన్ దెబ్బ కొట్టాలన్న ఉద్దేశ్యంతోనే వైసిపి తరపున పోటీ చేసిన 23 ఎంఎల్ఏలు, ముగ్గరు ఎంపిలను టిడిపిలోకి లాక్కున్నారు. ఇంకా మరికొంతమందిని లాక్కోవటానికి ప్రయత్నంచేశారు కానీ సాధ్యం కాక వదిలేశారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబుకు పీకలదాకా కోపం ఉన్న విషయం అందరూ గమనిస్తున్నదే. కాబట్టి చంద్రబాబు వదిలేసిన 25 సీట్లలో వైసిపి గెలవాలని ఎట్టి పరిస్ధితుల్లోను కోరుకునే అవకాశం లేదు.

 

అదే విధంగా వామపక్షాలు, కాంగ్రెస్ కూడా గెలవాలని కోరుకునే వ్యక్తి కాదు. ఎందుకంటే, చంద్రబాబు కోరుకున్నా పై పార్టీలు 25 సీట్లలో గెలిచేంత సీన్ లేదన్న విషయం అందరికీ తెలుసు. పోనీ భవిష్యత్ అవసరాల దృష్ట్యా బిజెపి గెలవాలని చంద్రబాబు కోరుకున్నా గెలిచేంత శక్తి బిజెపికి లేదు. ఇక మిగిలిన పార్టీ ఏది ? ఏదంటే ఒక్క జనసేన మాత్రమే. రేపటి ఎన్నికల్లో మళ్ళీ గెలవాలంటే చంద్రబాబుకు ఏదో ఓ పార్టీ మద్దతు అవసరం. అది కాంగ్రెస్ కావచ్చు లేదా జనసేన కూడా కావచ్చు.

 

తాజాగా చంద్రబాబు మాటలు వింటుంటే జనసేనతో పొత్తుకు ప్లాన్ రెడీ చేసుకుంటున్నట్లే అర్ధమవుతోంది. టిడిపి, జనసేన కలిస్తే జగన్ కు నొప్పేంటి అంటూ చంద్రబాబు అడిగిన మాట అందరికీ తెలిసిందే. కాబట్టి తనతో పొత్తుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సానుకూలమైతే బహుశా కాంగ్రెస్ ను చంద్రబాబు వదిలేసిన ఆశ్చర్యం లేదు. కాబట్టి తాను జనసేన కోసమే 25 సీట్లను వదిలేసినట్లు పార్టీలో చర్చలు ఊపందుకుంది. అంటే టిడిపి 150 సీట్లలోను జనసేన 25 సీట్లలోను పోటీ చేస్తుందని అనుకుంటున్నారు.