తొందరలో జరగబోయే ఎన్నికల్లో బిసిలకు ఏ పార్టీ అయితే ఎక్కువ టికెట్లిస్తుందో వారికే తమ ఆధరణ ఉంటుందని ఏపి బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు శంకర్ చెప్పారు. ‘తెలుగు రాజ్యం’ తో శంకర్ ప్రత్యేకంగా మాట్లాడుతూ, ప్రత్యేకించి బిసి సంఘం తరపున తాము పలానా పార్టీకి మద్దతు అంటూ నిర్ణయం తీసుకోలేదన్నారు. స్ధానికంగా ఉన్న పరిస్ధితులను బట్టి బిసిల్లోని ఉప కులాల నేతలు మాత్రం నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అంగీకరించారు.
వైసిపి అత్యధికంగా 41 బిసిలకు అసెంబ్లీ టికెట్లు, ఏడు పార్లమెంటు సీట్లు ఇచ్చిందన్నారు. అదే విధంగా తెలుగుదేశంపార్టీ కూడా 31 అసెంబ్లీలు, నాలుగు పార్లమెంటు టికెట్లిచ్చినట్లు చెప్పారు. జనసేనను గురించి ప్రస్తావించనపుడు ఆ పార్టీని పెద్దగా లెక్కలోకి తీసుకోలేదన్నారు. పలానా పార్టీయే అధికారంలోకి వస్తుందని ఇపుడే చెప్పలేకపోతున్నట్లు చెప్పారు. అయితే రాష్ట్రంలోని ప్రజల మూడ్ చూస్తే మాత్రం వైసిపి వైపే జనాల మొగ్గున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.
బిసిలకు టికెట్ల గురించి మాట్లాడుతూ ఏ పార్టీ అయినా జనాభా నిష్పత్తి ప్రకారం ఇవ్వలేదనే అసంతృప్తిని వ్యక్తం చేశారు. మొత్తం జనాభాలో బిసిల జనాభానే 54 శాతం ఉందని ఆ నిష్పత్తిలో మాత్రం ఏ పార్టీ కూడా టికెట్లివ్వలేదన్నారు. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగం, శ్రీకాకుళం జిల్లాల్లోని జనాభాలో దాదాపు 80 శాతం బిసిలే అన్నారు. అలాంటపుడు ఉత్తరాంధ్రలో ఏ పార్టీ ఎవరికి టికెటిచ్చినా దాదాపు బిసినే అయివుంటారని చెప్పారు.
బిసిలకు ఎక్కువ సీట్లు ఇవ్వాల్సొచ్చినపుడు ఉత్తరాంధ్రలో సర్దేసి బిసిలకు ఎక్కువ టికెట్లిచ్చామనే బిల్డప్ ఇస్తున్నట్లు మండిపడ్డారు. ఉభయగోదావరి జిల్లాలో మాత్రం రాబోయే ఎన్నికల్లో జగన్ కు ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూద్దామనే అభిప్రాయం కనబడుతోందన్నారు.