ఒకవైపేమో తుపాను ప్రాంతాల్లో అంతా చేసేశామని, అంతా బాగుందని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. తాజాగా తుపాను దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటనకు వచ్చిన శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్ మోహన్ నాయుడుకు బాధితులు చుక్కలు చూపించారు. సహాయ పునరావాస కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో చూసేందుకు వచ్చిన ఎంపికి వ్యతిరేకంగా బాధితులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నచ్చచెప్పేందుకు ఎంపి ఎంత ప్రయత్నించినా బాధితులు శాంతిచకపోవటంతో చేసేది లేక అక్కడి నుండి వెళ్ళిపోయారు.
ఇంతకీ విషయం ఏమిటంటే, తిత్లీ తుపాను దెబ్బకు శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నియోజకవర్గంని మండలాలతో పాటు మరికొన్ని మండలాలు కూడా బాగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. సరే, దెబ్బతిన్నంత తొందరగా సహాయ పునరావాస కార్యక్రమాలు చేయటం సాధ్యం కాదన్న విషయం అందరికీ తెలుసు. తుపాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో పునరావాస కార్యక్రమాలను స్పీడుగా చేసేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారు. అయితే, చంద్రబాబు ప్రయత్నాలు చేసినంత మాత్రాన పనులు జరగవుకదా ? వందలాది గ్రామాలకు అధికారులు ఇప్పటికి కూడా పూర్తిగా వెళ్ళలేకపోయారన్నది వాస్తవం.
వాస్తవం ఇలాగుంటే ప్రభుత్వం మాత్రం ఆల్ ఈజ్ వెల్ అన్నట్లుగా చెప్పుకుంటోంది. తుపాను దెబ్బతిన్న అన్నీ ప్రాంతాల్లోను రెస్టోరేషన్ పనులు చేసేస్తున్నామని, చాలా చోట్ల పనులు చేసేసినట్లు చెప్పుకుంటోంది. మామూలుగానే చంద్రబాబు ప్రభుత్వానికి చేసేది తక్కువ ప్రచారం ఎక్కువ. ఇక్కడ కూడా అదే జరిగింది. పునరావాస పనులు వేగంగా చేసేసినందుకు, అందరినీ ఆదుకున్నందకు బాధితులు చంద్రబాబుకు హారతులు పడుతున్నట్లుగా అమరావతిలో ప్రభుత్వం పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టించుకుంది. అక్కడే బాధితులందరికీ మండిపోయింది.
ఈరోజు ఉదయం శ్రీకాకుళం ఎంపి టెక్కలి నియోజకవర్గంలో పర్యటనకు రావటంతో ఆ కోపాన్నంతా ఆయనపై చూపించారు. అసలు ఎంపి కారులో నుండి దిగటానికి కూడా బాధితులు ఒప్పుకోలేదు. వాహనంలోనుండి దిగటానికి వీల్లేదని, తమతో మాట్లాడేందుకు లేదంటూ బాధితులు ఫుల్లుగా ఫైరైపోయారు.
తుపాను తీవ్రత తగ్గి పదిరోజులైనా ఇప్పటి వరకూ తమకు మంచినీళ్ళు, తిండి లాంటి కనీసవసరాలు కూడా అందటం లేదంటూ కేకలేశారు.
తమ బాధలు తీర్చకపోయినా సమస్యలన్నింటినీ తీర్చేశామని చెప్పుకోవటమేంటంటూ మండిపడ్డారు. బాధితుల ఆగ్రహం చూస్తే మీదపడి కొడతారేమో అన్నంత భమం వేసింది ఎంపి మద్దతుదారులకు. ఎంతసేపటికి బాధితులు శాంతిచకపోవటంతో చేసేది లేక ఎంపి కింజరాపు రామ్ మోహన్ నాయుడు కారు దిగకుండానే అక్కడి నుండి వెళ్ళిపోయారు.