ఏపీలో టీడీపీకి చెందిన అతి తక్కువ యువనేతల్లో రామ్మోహన్ నాయుడు ఒకరు. ఆయనకు ఉత్తరాంధ్రలో బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే… గత ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయినా కూడా ఆయన మాత్రం శ్రీకాకుళం ఎంపీగా బంపర్ మెజారిటీతో గెలిచారు. అది ఆయనకున్న ఇమేజ్.
ఆయన ఎంపీ అవడమే కాదు.. ఉత్తరాంధ్రకు రావాల్సిన హామీపై ఎప్పుడూ పార్లమెంట్ లో పోరాడుతూనే ఉంటారు. తనదైన శైలిలో మాట్లాడుతూ కేంద్రాన్ని నిలదీస్తూనే ఉంటారు.
తాజాగా పార్లమెంట్ సమావేశాల్లో మరోసారి తన గళాన్ని వినిపించారు. రాజధాని అంశం, పోలవరం ప్రాజెక్టు, జీఎస్టీ బకాయిలు.. తదితర అంశాలపై ఆయన కేంద్రాన్ని నిలదీశారు.
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం.. ఉత్తరాంధ్రకు రైల్వే జోన్ ప్రకటించారు కానీ.. ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు. ఉత్తరాంధ్రుల కల అయిన రైల్వే జోన్ ను వెంటనే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించాలని ఆయన కేంద్రాన్ని కోరారు.
2014 నుంచి రైల్వే జోన్ కోసం పోరాడితే.. 5 ఏళ్ల తర్వాత హామీ ఇచ్చారు. తర్వాత 18 నెలలు అయినా ఇప్పటి వరకు రైల్వే జోన్ ప్రారంభ పనులు ఏవీ ముందుకు నడవడం లేదని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
అయితే.. నిజానికి రామ్మోహన్ నాయుడు ప్రతిపక్షపార్టీకి చెందిన ఎంపీ. అధికారపార్టీకి చెందిన ఎంపీలు కేంద్రాన్ని నిలదీసి మరీ ఏపీకి రావాల్సిన హామీలను నెరవేర్చుకోవాలి. కానీ.. అధికార పార్టీ ఎంపీలు అసలు.. ఏపీకి సంబంధించిన హామీలను మరిచిపోగా… ప్రతిపక్షపార్టీకి చెందిన ఎంపీ.. ఉత్తరాంధ్రకు రావాల్సిన రైల్వే జోన్ పై పార్లమెంట్ లో కేంద్రాన్ని నిలదీయడం నిజంగా గొప్ప విషయం అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ కు ఈ విషయం తెలిస్తే ఆయన కూడా రామ్మోహన్ నాయుడిని మెచ్చుకుంటున్నారు.. అని చెబుతున్నారు.