వైసీపీ పార్టీకి పేరుకే 22 మంది ఎంపీలు ఉన్నారు. కానీ.. వాళ్లు చేసేదేం ఉండదు. పార్లమెంట్ లో ఏపీ కోసం ఏమాత్రం పోరాడరు. పార్లమెంట్ లో నాలుగో అతి పెద్ద పార్టీగా ఉన్న వైసీపీ పార్టీ.. ప్రత్యేక హోదాను ఎందుకు సాధించలేకపోతోంది.. అంటూ శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు నిలదీశారు.
ప్రత్యేక హోదా అంటేనే వైసీపీ పార్టీ భయపడి పారిపోతోంది. కేవలం తన కేసుల మాఫీ గురించే.. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారు తప్పితే రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు.. అంటూ రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు.
అధికారంలోకి ఏడాదిన్నర దాటినా.. ఇంకా కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ ఒత్తిడి తేలేకపోయింది. కేంద్రం నుంచి కనీసం నిధులను కూడా వైసీపీ ప్రభుత్వం తీసుకురాలేకపోయింది.. అంటూ రామ్మోహన్ విమర్శించారు.
నిజంగా ఏపీ మీద వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ వద్ద ఎందుకు వైసీపీ ఎంపీలు పోరాడటం లేదు. తన ఢిల్లీ పర్యటనలో జగన్.. రాష్ట్ర ప్రయోజనాల గురించి చర్చించలేదు. కనీసం వరి పంటకు మద్దతు ధర పెంచాలని కేంద్రాన్ని అడిగారా? అంటూ రామ్మోహన్ నాయుడు ఎద్దేవా చేశారు.
కేవలం టీడీపీ నేతలపై బూతులు తిట్టడానికి.. చంద్రబాబును తిట్టడానికి.. వైసీపీ నేతలు ప్రెస్ మీట్ పెడుతున్నారు తప్పితే రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు. ముఖ్యమంత్రి పదవి చాలా విలువైనది.. కానీ దాన్ని తన సొంత ప్రయోజనాల కోసం జగన్ వాడుకుంటున్నారు.. అంటూ రామ్మోహన్ నాయుడు విమర్శించారు.