Tiruvuru MLA: ‘అబ్బాయి, బస్తా పట్టు’.. ఎమ్మెల్యే అని తెలియక సాయం కోరిన మహిళ వైరల్ వీడియో

ప్రజాప్రతినిధి అంటే హంగులు, ఆర్భాటాలు ఉంటాయనుకునే ఈ రోజుల్లో, ఓ శాసనసభ్యుడు సామాన్యుడిలా మారి ఒక మహిళకు బస్తా మోసి సహాయం చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తన నిరాడంబరతతో అందరినీ ఆకట్టుకున్నారు. ఆయన ఎమ్మెల్యే అని తెలియని ఓ మహిళ, “ఓ అబ్బాయి బస్తా కొంచెం పట్టవా” అని అడగడం, ఆయన వెంటనే స్పందించి సాయం చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అసలేం జరిగిందంటే.. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘స్త్రీ శక్తి’ పథకం కింద మహిళల ఉచిత బస్సు ప్రయాణం అమలును పరిశీలించేందుకు స్థానిక బస్టాండ్‌కు వెళ్లారు. అక్కడ విజయవాడ వెళ్లే బస్సు ఎక్కి, ప్రయాణికులతో మాట్లాడారు. బస్సు కంభంపాడు వద్దకు చేరుకోగానే ఆయన కిందకు దిగారు.

అదే సమయంలో బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న ఓ మహిళ తన వద్ద ఉన్న బస్తాను బస్సులోకి ఎక్కించలేక ఇబ్బంది పడుతూ, అటుగా వస్తున్న శ్రీనివాసరావును చూసి, “ఏమండీ అబ్బాయి, కొంచెం ఈ బస్తా పడతారా” అంటూ సహాయం కోరారు. ఏమాత్రం ఆలోచించకుండా ఎమ్మెల్యే వెంటనే ఆ బస్తాను భుజాన వేసుకుని బస్సు దగ్గరకు తీసుకెళ్లారు. ఇది గమనించిన కండక్టర్ పరుగున వచ్చి సహాయం చేయబోగా, “పర్లేదులే” అంటూ ఎమ్మెల్యేనే బస్తాను బస్సులోకి అందించారు.

ఆ తర్వాత, అక్కడున్న వారు ఆయన తిరువూరు ఎమ్మెల్యే అని చెప్పడంతో ఆ మహిళ ఆశ్చర్యానికి గురయ్యారు. “అయ్యో, ఎమ్మెల్యే గారితో బస్తా మోయించానే” అంటూ కంగారు పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఎమ్మెల్యే సాదాసీదా తత్వంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

అమరావతిపై జగన్‌ది పైశాచిక ఆనందం- ఎమ్మెల్యే కొలికపూడి: ఈ ఘటనతో నిరాడంబరంగా కనిపించిన ఎమ్మెల్యే కొలికపూడి, మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అమరావతిపై జగన్ తన మీడియా ద్వారా విషపు రాతలు రాయిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు.

“చిన్నపాటి వర్షానికే అమరావతి మునిగిపోయిందని అసత్య ప్రచారం చేస్తున్నారు. 400 ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరమే వానలకు అతలాకుతలం అవుతోంది. అలాంటప్పుడు అమరావతిపై దుష్ప్రచారం చేయడం తగదు. 2014లో మేం అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీ కూడా మద్దతు ఇచ్చింది. తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్న జగన్ ఇల్లు మునిగిందా?” అని ఆయన ప్రశ్నించారు. అమరావతిపై చర్చకు తాను సిద్ధమని, జగన్ గానీ, ఆయన పార్టీ నేతలు గానీ రావొచ్చని సవాల్ విసిరారు.

సుగాలి ప్రీతి కేసు || High Court Advocate Vijay Babu EXPOSED Truth Behind Sugali Preethi Case || TR