తిరుపతి బై పోల్: లైట్ తీసుకుంటున్న వైసీపీ క్యాడర్.?

YCP Cadre take it very light

YCP Cadre take it very light

తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి అధికార వైసీపీ తిరుగులేని ధీమాతో వుంది. ‘అస్సలేమాత్రం లైట్ తీసుకోవద్దు. ఈ ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకం. మెజార్టీ విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి. రికార్డు మెజార్టీ సాధించాల్సిందే..’ అని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా, తిరుపతి లోక్ సభ నియోజకవర్గ నేతల్లో కొంత అలసత్వం స్పష్టంగా కనిపిస్తోంది. పంచాయితీ, మునిసిపల్ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందుకున్నాం గనుక, పెద్దగా కష్టపడకపోయినా తిరుపతి ఉప ఎన్నికలో మంచి మెజార్టీ వచ్చేస్తుందన్న భావనతో కింది స్థాయి క్యాడర్ వుంది. మరోపక్క, ముఖ్య నాయకుల్లోనూ కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కొన్ని అసెంబ్లీ సిగ్మెంట్ల పరిధిలో వినిపిస్తోంది. కాగా, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ.. అనూహ్యంగా పుంజుకునే అవకాశాలున్నాయంటూ స్థానికంగా చర్చ జరుగుతోంది.

బరిలో టీడీపీ తరఫున నిలబడిన అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి మహిళ కావడం సహా అనేక అంశాలు టీడీపీకి కలిసొచ్చేలా వున్నాయి. మొదట్లో పనబాక లక్ష్మి కూడా లైట్ తీసుకున్నా, అనూహ్యంగా ఆమె జోరు పెంచేశారు. నియోజకవర్గాల వారీగా, మండలాల స్థాయిలో టీడీపీ నిర్వహిస్తున్న సమీక్షలతో వైసీపీ శ్రేణుల్లో కొంత ఆందోళన బయల్దేరింది. అయినాగానీ, అలసత్వం మాత్రం వీడలేకపోతున్నరాట కొందరు నేతలు. ఇదిలా వుంటే, బీజేపీ మాత్రం మొదట హడావిడి చేసిన స్థాయిలో ఇప్పుడు ముందడుగు వేయలేకపోతోంది.

బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు హంగామా ఒక్కటే కాస్త మీడియాలో హైలైట్ అవుతోంది. కీలకంగా వ్యవహరించాల్సిన నేతల్లో చాలామంది అలసత్వం ప్రదర్శిస్తుండగా, మిత్రపక్షం జనసేన మొత్తంగా సీన్‌లో లేకుండా పోతోంది. ‘రెండో స్థానానికే బీజేపీ అయినా టీడీపీ అయినా పోటీపడాలి..’ అనే ‘అతి విశ్వాసంతో కూడిన తీరు’ వైసీపీకి గెలుపు పరంగా ఇబ్బంది కలిగించకపోయినా, మెజార్టీ పరంగా షాకిచ్చే అవకాశం లేకపోలేదు. రాజకీయాల్లో ఈక్వేషన్స్ రాత్రికి రాత్రి మారిపోతాయి. ఏ చిన్న అలసత్వమైనా పార్టీ ఓటమికి బలమైన కారణం కావొచ్చన్న కఠోర వాస్తవాన్ని తిరుపతి వైసీపీ నేతలు గుర్తిస్తారా.?