హోరా హోరీ… ఏపీలో టెన్షన్ పెడుతున్న కొత్త సర్వే ఫలితాలు!

ఆంధ్రప్రదేశ్‌ లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలు సర్వే సంస్థలు వెల్లడిస్తున్న ఫలితాలు ఆసక్తిగా మారుతున్నాయి. వీటిలో కొన్ని సర్వే ఫలితాలు లోక్ సభ స్థానాలకు మాత్రమే వెల్లడవుతుండగా… మరికొన్ని అసెంబ్లీ స్థానాలతో పాటు వెల్లడవుతున్నాయి. ఇంకొన్ని నియోజకవర్గాల వారీగా ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఈ సమయంలో తాజాగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థ “టైమ్స్‌ నౌ” ఏపీలో లోక్ సభ స్ సర్వే ఫలితాలు వెల్లడించింది.

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలన్నీ ప్రచారలలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో “వైనాట్ 175” అంటున్న జగన్… అభ్యర్థులను ఎంపికను దాదాపు పూర్తి చేసి, “సిద్ధం” పేరుతో బహిరంగ సభలను నిర్వహిస్తూ రణభేరిని మోగించారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు “రా కదలిరా” అంటూ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. మరోపక్క బీజేపీతో పొత్తు చర్చలు జరుపుతున్నారు! 2014 ఫలితాలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.

ఈ సమయంలో వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీ ఎన్ని లోక్ సభ స్థానాల్లో గెలిచే అవకాశం ఉందనే విషయాలు వెల్లడయ్యాయి. ఇందులో భాగంగా… టైమ్స్‌ నౌ సర్వే ఫలితాల ప్రకారం అధికార వైసీపీ మరోసారి సత్తా చాటబోతుందని తెలుస్తుంది. అయితే 2019లో సాధించినట్లుగా 22 స్థానాలు కాకపోయినా.. కనీసం 19 స్థానాల్లో వైసీపీ సత్తా చాటే అవకాశం ఉందని అంటున్నారు! ఈ మేరకు టైమ్స్‌ నౌ వెల్లడించిన ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.

ఏపీలోని 25 లోక్‌ సభ స్థానాల్లోనూ 19 ఎంపీ స్థానాలు వైసీపీ దక్కించుకుంటుందని.. తెలుగుదేశం – జనసేన కూటమికి 6 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశముందని టైమ్స్‌ నౌ చెప్పింది. కాగా… 2019 లోక్‌ సభ ఎన్నికల్లో వైసీపీ 22 ఎంపీ స్థానాల్లో విజయం సాధించగా… టీడీపీ 3 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఇక ఓట్ల షేరింగ్ విషయానికొస్తే… వైసీపీ 47.6 శాతం ఓట్లు దక్కించుకుంటుందని స‌ర్వే రిప్టోర్టు తెలపగా… టీడీపీ – జనసేన కూటమి 44.4 శాతం ఓట్లు పొందుతారని తేల్చింది. ఇక టైమ్స్‌ నౌ సర్వేను వైసీపీ తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేయగా.. ఇవి ఆ పార్టీ శ్రేణుల్లో మరింత జోష్‌ నింపుతున్నాయి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… జాతీయ పార్టీలు బీజేపీకి 2.1 శాతం, కాంగ్రెస్‌ 1.5 శాతం ఓట్‌ షేర్‌ దక్కే అవకాశాలున్నాయని టైమ్స్‌ నౌ సర్వే స్పష్టం చేసింది. అంటే… టీడీపీ – జనసేన కూటమితో బీజేపీ కూడా కలిస్తే… 44.4 + 2.1 = 46.5 శాతం ఓట్లు ఈ కూటమికి వచ్చే అవకాశం ఉందన్నమాట! అప్పుడు కూడా వైసీపీ లీడ్ లో ఉన్నప్పటికీ… తేడా మాత్రం కేవలం 1 శాతం ఓట్ల తేడా కావడం గమనార్హం.

అయితే… రాజకీయాల్లో ప్రతీసారీ 1 + 1 = 2 కాదనే నానుడి ఉన్న సంగతి తెలిసిందే. ఏది ఏమైనా… వచ్చే ఎన్నికల్లో ఏపీలో రసవత్తర పోరు మాత్రం కన్ ఫాం అని ఈ ఫలితాలను బట్టి తెలుస్తుంది.