మూడు రాజధానులు మా విధానం: స్పష్టం చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్

‘పరిపాలనా వికేంద్రీకరణ మా విధానం. అభివృద్ధి అన్ని ప్రాంతాలకూ విస్తరించాలి. అలా జరగాలంటే, మూడు రాజధానులు వుండాల్సిందే. మా విధానం మూడు రాజధానులు..’ అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంకోసారి మూడు రాజధానుల విషయమై కుండబద్దలుగొట్టేశారు. అదీ, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో.

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయ్యింది. అయితే, వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక, అమరావతిని కేవలం శాసన రాజధానిగా పరిమితం చేస్తూ, కార్య నిర్వాహక రాజధానిని విశాఖకు తరలించాలనుకున్నారు. న్యాయ రాజధాని పేరుతో హైకోర్టును కర్నూలుకి తరలించే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ మేరకు చట్ట సభల్లో బిల్లుని పెట్టి, ఆమోదించేసినా.. న్యాయస్థానాల్లో జగన్ సర్కారుకి చుక్కెదురయ్యింది. దాంతో, ‘బిల్లుని వెనక్కి తీసుకుంటున్నాం..’ అని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకి విన్నవించుకుంది. అయితే, అసెంబ్లీలో బిల్లు ఉపసంహరించుకునే క్రమంలో, ‘మరింత మెరుగైన బిల్లు తీసుకొస్తాం..’ అని ప్రకటించింది వైఎస్ జగన్ సర్కారు.

కానీ, ఏదీ.? ఎక్కడ.? మూడు రాజధానుల బిల్లు మళ్ళీ వుంటుందా..? వుండదా.? ఒక్క రాజధాని అభివృద్ధికే దిక్కు లేదు, మూడు రాజధానులెలా.? అన్న ప్రశ్నలకు ఎందుకు వైఎస్ జగన్ సర్కారు సరైన సమాధానం చెప్పలేకపోతోంది.? ఏమోగానీ, వచ్చే ఎన్నికల నాటికి ఈ అంశాన్ని సజీవంగా వుంచాలన్న ఆలోచనతో వైఎస్ జగన్ వున్నారన్న విషయం స్పష్టమవుతోంది.