3 క్యాపిటల్స్: సుప్రీంకోర్టు తలుపు తట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల విషయమై సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సుమారు 200 రోజుల తర్వాత వైఎస్ జగన్ సర్కారు అత్యంత వ్యూహాత్మకంగా సుప్రీంకోర్టుని ఆశ్రయించిందనుకోవాలా.? ఈ సమయం వృధా చేసిందని అనుకోవాలా.?

ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన తర్వాత, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అవసరమైంది. పదేళ్ళపాటు హైద్రాబాద్, ఉమ్మడి రాజధానిగా వున్నా.. వేరే రాష్ట్రంలో తమ రాజధాని.. అంటే, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమంత గౌరవం కాదు. ఈ నేపథ్యంలో శాసనసభ ఆమోదంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఖరారు చేసింది.

విభజన చట్టం ప్రకారం రాజధాని విషయమై కేంద్రం ఓ కమిటీ ఏర్పాటు చేయడం, ఆ కమిటీ పలు అంశాల్ని తన నివేదికలో పేర్కొనడం.. ఇవన్నీ తెలిసిన విషయాలే. అయితే, రాజధానికి అనుకూలం కాని ప్రాంతంలో రాజధానిని నిర్మించారని వైసీపీ అంటోంది. నిజానికి, గతంలో అసెంబ్లీ సాక్షిగా రాజధానిపై తీర్మానం చేసినప్పుడు వైసీపీ అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక మాత్రం రాజధాని అమరావతి విషయంలో పునరాలోచన చేసింది. ఒక్క రాజధాని సరిపోదు, మరో రెండు రాజధానులు అవసరమని చెప్పింది.. ఈ మేరకు మూడు రాజధానుల బిల్లు కూడా అసెంబ్లీలో పెట్టి, పాస్ చేసేశామనిపించుకుంది. కానీ, ఆ బిల్లు చట్టంగా మారలేదు.

రాజధాని అమరావతి కోసం రైతులు భూములివ్వడం, ఈ క్రమంలో రైతులకీ, ప్రభుత్వానికీ మధ్య ఒప్పందాలు జరగడం.. ఇవన్నీ మూడు రాజధానుల వ్యవహారానికి ఇబ్బందిగా మారాయి. న్యాయ వివాదాల కారణంగా, బిల్లుని వెనక్కి తీసుకుంటున్నట్లు వైసీపీ ప్రభుత్వమే కోర్టుకు తెలిపింది.

మరోపక్క, రైతులకీ, ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందాల్ని గౌరవించాలనీ, అది కాదని.. అడ్డగోలు నిర్ణయాలు చేయడం కుదరదని హైకోర్టు మొట్టికాయలేసింది కూడా ఏపీ సర్కారుకి.
అప్పట్లోనే ఈ విషయమై సర్వోన్నత న్యాయస్థానాన్ని ఏపీ సర్కారు ఆశ్రయించి వుండాలి. ఊరించి,

ఉస్సూమరిపించినట్లుగా.. ఇప్పుడు సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే, ఈ కేసు ఎప్పటికి తేలుతుంది.? ఒకవేళ సుప్రీంకోర్టులో కూడా ఏపీ సర్కారుకి చుక్కెదురయితే, ఆ తర్వాత ఏమవుతుంది.?