హిందూపూర్‌లో బాలయ్య హ్యాట్రిక్ కష్టమేనా.?

2019 ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా సాగినా, విజయం మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణనే వరించింది. 2014 ఎన్నికల్లో గెలవడానికి పెద్దగా కష్టపడని బాలయ్య, 2019 ఎన్నికల్లో మాత్రం నానా తంటాలూ పడాల్సి వచ్చింది.

హిందూపురం నియోజకవర్గమంటే టీడీపీకి కంచుకోట. కానీ, అది ఒకప్పుడు. గత కొంతకాలంగా హిందూపురం నియోజకవర్గంలో సమీకరణాలు మారాయి. అయినా, ఇప్పటికీ టీడీపీకే ఎడ్జ్ వుందన్నది నిర్వివాదాంశం. ఈ నేపథ్యంలో హిందూపురం నియోజకవర్గంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు.

స్థానిక వైసీపీలో అంతర్గతంగా వున్న విభేదాలే టీడీపీకి బలంగా మారుతున్నాయని వైఎస్ జగన్ గుర్తించారు. సొంత పార్టీ నేతల్ని చంపుకునేదాకా వైసీపీలో ఈ గ్రూపు రాజకీయాలు దిగజారినప్పటికీ, డ్యామేజ్ కంట్రోల్ చర్యలు తీసుకోవడంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ విఫలమయ్యారు.

‘హిందూపురంపై స్పెషల్ ఫోకస్ పెట్టాం..’ అని వైసీపీ అధినాయకత్వం పదే పదే చెబుతోంది. అయితే, కుప్పం తరహాలో హిందూపురం విషయంలో ఎందుకు అంత శ్రద్ధ పెట్టడంలేదన్న ప్రశ్న తెరపైకొస్తోంది. అ క్రమంలోనే అతి త్వరలో హిందూపురం వైసీపీ విషయమై అధినాయకత్వం ఓ ప్రత్యేక సమావేశాన్ని స్థానిక నాయకత్వంతో ఏర్పాటు చేయబోతోందట.

త్వరలో హిందూపురంలో జగన్ సైతం పర్యటించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. మరోపక్క, బాలయ్య ఎమ్మెల్యేగా హిందూపురం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో వుండటంలేదు. ఇది అధికార పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందా.? అంటే, ముందైతే వైసీపీలో స్థానిక గొడవలు చల్లారాలి. చల్లార్చగలిగితే మాత్రం వైఎస్ జగన్, హిందూపురంలో వైసీపీని గెలిపించడం పెద్ద కష్టమేమీ కాదు.