ఏపీ సీఎం వై ఎస్ జగన్ అనూహ్యంగా ఢిల్లీ పర్యటనకి బయల్దేరి వెళ్లారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆలయాలపై దాడుల ఘటనల నేపథ్యంలో బీజేపీ నేతలు, ఇటీవల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదులు చేశారు. రాష్ట్ర బీజేపీ నేతలు రాష్ట్రంలో ఆలయాలపై జరిగే దాడుల గురించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. దీనితో ఏకంగా హోంశాఖ మంత్రి అమిత్ షా నుంచి జగన్‌కు పిలుపు వచ్చింది.
అయితే , సీఎం జగన్ ఢిల్లీ పర్యటన పై ప్రభుత్వ వర్గాల్లో భిన్నమైన కథనాలు వస్తున్నాయి. జిల్లాల విభజనకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకున్న నేపథ్యంలో దీనిన ప్రభుత్వానికి వివరించేందుకు జగన్ ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారని సీనియర్ నాయకులు అంటున్నారు. అయితే.. అదే సమయంలో మరో రెండు విషయాలు కూడా ఉన్నాయనే సమాచారం అందుతోంది.ఒకటి.. ఆలయాలపై దాడులు, బీజేపీ నేతలకు ఎదురవుతున్న అడ్డంకులపై కేంద్రమే జగన్ ను పిలిపించిందని చెబుతున్నారు.
దీంతో ఏం జరుగుతుంది ,సీఎం వైఎస్ జగన్ కు అమిత్ షా ఏమైనా షాక్ ఇస్తారా అనే చర్చ జోరుగా సాగుతోంది. దీనిపై వైసీపీ నాయకులు ఫోన్లపై ఫోన్లు చేసుకుని మరీ చర్చించుకుంటున్నారు. ఇదిలావుంటే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో మరో సారి వివాదం ఏర్పడడాన్ని కూడా కేంద్రం సీరియస్‌గానే భావిస్తోంది. అయితే.. ఇప్పుడు షెడ్యూల్ ఇచ్చిన తర్వాత కూడా జగన్ సర్కారు సహకరించేది లేదని చెప్పడాన్ని బట్టి.. కేంద్రం దూకుడుగా వెళ్తున్న ఏపీకి బ్రేకులు వేయాలని నిర్ణయించుకున్నట్టుగా టీడీపీ నేతల్లో ప్రచారం జరుగుతోంది. దీనితో సీఎం ఢిల్లీ టూర్ పై అందరిలో ఆసక్తి నెలకొంది.