Meda Raghunath – Kharge: మేడా-ఖర్గే భేటీపై వీడిన సస్పెన్స్: జగన్ వెంటే నా ప్రయాణం

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో తన భేటీపై వస్తున్న రాజకీయ ఊహాగానాలకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్ రెడ్డి తెరదించారు. ఆ భేటీ పూర్తిగా వ్యక్తిగతమైనదని, దీనికి రాజకీయ ప్రాధాన్యత లేదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం తన ప్రయాణం వైఎస్ జగన్ వెంటేనని, పార్టీ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని ఆయన తేల్చిచెప్పారు.

అసలేం జరిగింది?
ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ వైసీపీ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఎన్డీయే అభ్యర్థికి వైసీపీ మద్దతు ప్రకటించిన తరుణంలో ఈ భేటీ జరగడంతో, మేడా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి అభ్యర్థికి ఓటు వేస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఆయన కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేశాయి.

ఖర్గేతో 35 ఏళ్ల పరిచయం
ఈ ఊహాగానాలపై స్పందించిన మేడా రఘునాథ్ రెడ్డి, హైదరాబాద్ నుంచి ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. “మల్లిఖార్జున ఖర్గే గారితో నాకు 35 సంవత్సరాలుగా వ్యక్తిగత పరిచయం ఉంది. ఆ స్నేహంతోనే మర్యాదపూర్వకంగా కలిశాను. వ్యక్తిగత సంబంధాలకు రాజకీయ రంగు పులిమి, అసంబద్ద కథనాలు ప్రచారం చేయడం తగదు,” అని ఆయన మీడియాకు హితవు పలికారు.

జగన్ నాయకత్వంపై పూర్తి విశ్వాసం
పార్టీ అధినేత వైఎస్ జగన్‌పై తనకు పూర్తి విశ్వాసం ఉందని, అదేవిధంగా జగన్‌కు కూడా తనపై నమ్మకం ఉందని మేడా స్పష్టం చేశారు. “రాజకీయాల్లో ఉన్నంతకాలం వైఎస్ జగన్ వెంటే నా పయనం. రాబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికలో పార్టీ అధ్యక్షుడి నిర్ణయమే మా అందరికీ శిరోధార్యం. ఇందులో మరో ఆలోచనకు తావు లేదు,” అని ఆయన పేర్కొన్నారు. పార్టీ ఎంపీలందరూ జగన్ నాయకత్వంలోనే పనిచేస్తున్నారని, రాబోయే రోజుల్లో వైఎస్ జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేయడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు.

ఈ స్పష్టతతో, మేడా రఘునాథ్ రెడ్డి పార్టీ మారుతున్నారనే ప్రచారానికి అడ్డుకట్ట పడినట్లయింది.

నాలుగు లక్షల మంది పెన్షన్ కట్.?| KS Prasad Gives Clarity Over Kutami Pension Promis | Telugu Rajyam