వారాహి స్పెషల్: యాత్ర వెనుక అసలు లక్ష్యం ఇదే!

జనసైనికులు ఎప్పటినుంచో ఆశిస్తున్న వారాహి యాత్ర మొదలైపోయింది. ఎంతో కాలంగా ఊరించి ఊరించిన పవన్ ప్రచార రధం రోడ్లపైకి వచ్చింది. అది కూడా తనకు బలం పెరిగిందని చెబుతున్న గోదావరి జిల్లా రోడ్లపై దూసుకుపోయింది. దీంతో జనసైనికులు ఎప్పుడూ లేని ఉత్సాహంతో ఉన్నారు. ఈ సందర్భంగా అసలు పవన్ ఈ యాత్రను ఎందుకు చేపట్టారనే ప్రశ్న తెరపైకి వచ్చింది.

అసలు పవన్ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు అనే కీలక ప్రశ్నను కాసేపు పక్కనపెడితే… ఆయన అధికారంలోకి రావాలని, సీఎం అవ్వాలని ఫలితంగా రెండు సామాజికవర్గాల మధ్య దోబూచులాడుతున్న అధికారాన్ని మరో వర్గానికి కూడా దక్కించాలని కోరుకున్నారు. అయితే వారి కోరికను 2014లో పవన్ తొక్కిపెట్టారు. చంద్రబాబుకు మద్దతు ఇచ్చారు. తనను నమ్మి టీడీపీ ఓటు వేయండి.. ప్రభుత్వాన్ని మీ తరుపున నేను ప్రశ్నిస్తానని చెప్పుకున్నారు.

కాలం గడిచింది.. ప్రజలు పవన్ ను నమ్మారు.. బాబు సీనియారిటీకి విలువిచ్చారు. అయితే బాబు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు.. పవన్ తన మాటను నిలబెట్టుకోలేదు. ఫలితంగా 2019 ఎన్నికల్లో పవన్ ను ప్రజలు తొక్కారు! దీంతో పవన్ లో ఒక భయం మొదలైంది. 2024 లో కూడా ఒంటరిగా పోటీచేస్తే వీరమరణమే అనే ఆలోచన మొదలైంది.

ఈ సమయంలో పవన్ నిత్యం ప్రజలను, తన అభిమానులను, తన కార్యకర్తలను తప్పుపట్టడం మొదలుపెట్టారు. అయితే అది ప్రజల తప్పు కాదు.. తన ప్రవర్తన లోపం అన్న ఇంగితం మరిచారు! తన పద్దతి కరెక్ట్ గా ఉంటే తన వెనక నడవడానికి లక్షల మంది ఉన్నారన్న విషయం విస్మరించారు. దీంతో… పవన్ ఇప్పుడు మరోసారి చంద్రబాబుతో పొత్తు కోసం ప్రాకులాడుతున్నారు.

అయితే 2019 ఎన్నికల ఫలితాలు చూసిన అనంతరం పవన్ కు పొత్తులో భాగంగా టీడీపీ పట్టుమని 10 సీట్లు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ… కాపు ఓటు బ్యాంకును పవన్ ప్రభావింతం చేయగలిగితే.. అది 175 నియోజకవర్గాల్లోనూ తమకు కలిసొస్తుందని టీడీపీ బలంగా నమ్ముతుంది. అయితే ఇప్పుడు పవన్ తన బలం పెరిగిందని చెప్పుకుంటున్నారు.

అయితే సర్వే ఫలితాలు చూపించి తన బలం పెరిగిందంటే నమ్మే అంత అమాయకుడు కాదు చంద్రబాబు. కాబట్టి.. ఈ సమయంలో వారాహి వాహనం వేసుకుని జనాల్లో తిరిగితే… భారీ ఎత్తున జనసమీకరణ చేస్తే… తనకిచ్చే సీట్ల సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నట్లున్నారు పవన్!

ఇందులో భాగంగానే వేదికలపైకి స్థానిక నాయకులకు స్థానం లేకుండా తానొక్కడే ఎక్కి ప్రసంగిస్తున్నారు. అంటే ఇంకా లోపాయకారీగా కూడా సీట్లపై పవన్ కు చంద్రబాబు మాట ఇవ్వలేదన్నమాట. మరి మాట ఇవ్వకుండానే, మాట తీసుకోకుండానే పవన్ సెలక్టివ్ నియోజకవర్గాల్లోనే ఎందుకు యాత్ర చేస్తున్నట్లో పవన్ కి కూడా తెలియదు అన్నమాట!

అంటే జస్ట్ పవన్ ఇప్పుడు తన పవర్ ను జగన్ కో, ప్రభుత్వానికో చూపించడం కోసమో కాదు… ముందుగా చంద్రబాబుకు చూపించాలని పరితపిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ ప్రసంగం చూసినవారెవరికైనా ఈ విషయం అర్ధమవుతుంది. దీనివల్ల వచ్చే ఎన్నికల్లో ఒక 50 సీట్ల వరకూ అడిగి అందులో 30 సీట్ల వరకూ గెలిస్తే… రాబోయే ఎన్నికల ఫలితాల అనంతరం కీలక భూమిక పోషించొచ్చనేది ఆయన నమ్మకంగా తెలుస్తుంది!

అందువల్ల ఇప్పుడు పవన్ తక్షణ కర్తవ్యం… చంద్రబాబుకు తన పవర్ చూపించడం. తన సభలు గ్రాండ్ సక్సెస్ అని చెప్పుకోవడం. ఫలితంగా కనీసం గోదావరి జిల్లాల్లో అయినా ఆశించిన సీట్లు సంపాదించుకోవడం. అనంతరం గతంలో కర్ణాటకలో జేడీఎస్ కుమారస్వామిలా మారిపోగలలని కలలు కనడం అన్నమాట!

మరి జనసేనాని ఆశిస్తున్నట్లుగా చంద్రబాబు పవన్ బలాన్ని నమ్మి పెద్ద నెంబర్ సీట్లే ఇస్తారా.. ఫలితంగా పవన్ అనుకున్నది సాధిస్తారా.. లేక, మరోసారి బంగపాటు తప్పదా అనేది వేచి చూడాలి!