కొత్త పనులకు నిధులు లేవట.. పథకాలే జగన్ కొంప ముంచుతున్నాయా?

ఏపీ ప్రభుత్వం లెక్కకు మించిన పథకాలను అమలు చేస్తూ పథకాల విషయంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే అభివృద్ధి విషయంలో జగన్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సరిగ్గా లేని రోడ్ల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఏపీలో కొత్త పనులకు నిధులు లేవని సమాచారం అందుతోంది.

ఆర్థిక శాఖ అధికారుల నుంచి తాజాగా ఈ మేరకు మార్గదర్శకాలు జారీ అయ్యాయని తెలుస్తోంది. తగినంత బడ్జెట్ కేటాయింపులు జరిగిన తర్వాతే ప్రత్యేకంగా చేపట్టిన ప్రాజెక్ట్ లను మొదలుపెట్టనున్నారని సమాచారం అందుతోంది. కేంద్రం అమలు చేస్తున్న పథకాలపై మరి కొంతమొత్తం ఖర్చు చేసి రాష్ట్రంలో కొత్త పనులను మొదలుపెట్టడానికి సైతం ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు.

జగన్ సర్కార్ ఏదో ఒక పథకానికి నిధులను ఆపేసి అభివృద్ధిపై దృష్టి పెడితే బాగుంటుందని చెప్పవచ్చు. ఇందుకు సంబంధించి ప్రజల నిర్ణయాలకు అనుగుణంగా జగన్ సర్కార్ ముందుకు వెళితే బాగుంటుందని మరి కొందరు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరగడానికి మరో 16 నెలల సమయం మాత్రమే ఉందనే సంగతి తెలిసిందే. అభివృద్ధి విషయంలో వ్యతిరేకత ప్రభుత్వంపై పడే అవకాశాలు అయితే ఉంటాయి.

టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ పథకాల అమలు సరిగ్గా జరగకపోయినా కొంతమేర అభివృద్ధి జరిగింది. రాష్ట్రంలో జగన్ సర్కార్ పై ఉన్న వ్యతిరేకత టీడీపీకి వరంగా మారుతోంది. అభివృద్ధి విషయంలో వ్యక్తమవుతున్న విమర్శలపై సీఎం జగన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.