ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా.. కొత్తగా ఏర్పడిన డా.బీఆర్ అంభేద్కర్ కోనసీమ జిల్లాలో పి.గన్నవరం నియోజకవర్గం ఒకటి. రాజకీయంగా చైత్యన్యం కాస్త ఎక్కువగా ఉండే గోదావరి జిల్లాలో ఈసారి ఈ నియోజకవర్గం కూడా కీలకం కాబోతోంది! కారణం… ఈ నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ, జనసేన… మూడు పార్టీలూ బలంగానే ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కొండేటి చిట్టిబాబు గెలుపుకు ఇది కూడా ఒక కారణం. ప్రభుత్వ వ్యతిరేక ఓటును వైసీపీతోపాటు జనసేన కూడా గట్టిగానే చీల్చగలిగింది.
అవును… గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గాలి బలంగా వీచిన సంగతి తెలిసిందే. వార్ వన్ సైడ్ అన్నట్లుగా సాగిన ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా కొండేటి చిట్టిబాబు ఇరవై రెండు వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే… ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… గడిచిన ఎన్నికల్లో కొండేటి చిట్టిబాబుకి 67,373 ఓట్లు పోలవ్వగా… టీడీపీ అభ్యర్థి స్టాలిన్ బాబుకి 45,166 ఓట్లు, జనసేన అభ్యర్థి పాముల రాజేశ్వరీ దేవికి 36,259 ఓట్లు పోలయ్యాయి. అంటే… ఈ రెండు పార్టీల ఓట్లు కలిస్తే… 81,425. అంటే… కొండేటి చిట్టిబాబుకి పోలైన ఓట్లకంటే 14,052 ఓట్లు అధికమన్నమాట!
తాజాగా ఈ గణాంకాలను పరిశీలిస్తున్న విశ్లేషకులు… టీడీపీ – జనసేన కలిసి పోటీచేస్తే వైసీపీ గెలుపుపై ప్రభావం చూపించే నియోజకవర్గాల్లో ఇదొకటని అంటున్నారు. అయితే స్థానికంగా వైసీపీకి బలమైన ఓటుబ్యాంకే ఉన్నప్పటికీ… వైసీపీ ఎమ్మెల్యేపై మాత్రం అంతకంటే బలమైన వ్యతిరేకత ఉందనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. పార్టీలకతీతంగా… ఆ మీడియా – ఈ మీడియా అనే తారతమ్యాలు లేకుండా ప్రజల్లో చిట్టిబాబుపై ఉన్న వ్యతిరేకతపై కథనాలొస్తున్న పరిస్థితి! ఇది ప్రస్తుతం మీడియా అవలంభిస్తున్న వైఖరికి భిన్నమైనదే అయినా… కొడేటిపై ఉన్న వ్యతిరేకత ఈ మార్పుకి కారణం అని తెలుస్తుంది!
ఈ లెక్కన టీడీపీ – జనసేనలు కాస్త మనసుపెడితే… వైసీపీ గెలుపును అడ్డుకోవడంలో సక్సెస్ అవ్వొచ్చని అంటున్నారు విశ్లేషకులు. మరి పొత్తులోకి వచ్చిన పక్షంలో… ఈ రెండు పార్టీలూ ఈ నియోజకవర్గంపై ఏ మేరకు శ్రద్ధ పెడతాయి.. ప్రస్తుతం ఈ కూటమి సులువుగా గెలుచుకునే స్థానాల్లో ఒకటిగా మారిన పి.గన్నవరంపై ఏ పార్టీ అభ్యర్థిని నిలబెడతాయి అనేది వేచి చూడాలి.