ఇది క్లియర్.! ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాత్రమే.!

సర్వోన్నత న్యాయస్థానంలో జనవరి 31న ఎలాంటి వాదనలు చోటు చేసుకుంటాయి.? ఆ తర్వాత తీర్పులు, పరిణామాలు ఎలా వుంటాయి.? అన్నది వేరే చర్చ. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి మాత్రమే. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సర్వోన్నత న్యాయస్థానానికి తెలియజేసింది.. తమ న్యాయవాదుల ద్వారా. ఈ మేరకు అఫిడవిట్లను కూడా ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలు చేయాల్సి వుంటుంది. రాష్ట్ర రాజధాని అమరావతి విషయమై గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసిన దరిమిలా, ‘కాలపరమితి’ అంశాలపై తాత్కాలిక స్టే లభించింది. ఇది ఏపీ సర్కారుకి లభించిన ఊరట మాత్రమే. అయితే, కాల పరిమితిని ఎలా హైకోర్టు నిర్ణయిస్తుందంటూ సుప్రీం ఘాటు వ్యాఖ్యలు చేసిందనుకోండి.. అది వేరే సంగతి.

అయినాగానీ, మూడు రాజధానుల వ్యవహారానికి సంబంధించి ఏ చట్టమూ, ఏ బిల్లూ ప్రస్తుతం అమలులో లేదు. చట్ట సభల నుంచి బిల్లుని వెనక్కి తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అఫిడవిట్లను దాఖలు చేయనుంది గనుక, ఈ కేసులో తుది తీర్పు వచ్చేవరకు మూడు రాజధానుల విషయమై రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళడం దాదాపు అసాధ్యం. పైగా, హైకోర్టు విషయమై సర్వోన్నత న్యాయస్థానం కొంతమేర స్పష్టతనిచ్చింది. రాష్ట్ర రాజధాని విషయంలోనూ ఇంకాస్త స్పష్టత వచ్చింది. విభజన చట్టంలో పేర్కొన్న రాజధాని అంశం, ఆ విభజన చట్టంలోనే హైకోర్టు ప్రస్తావన.. ఇవన్నీ వున్న దరిమిలా, కేంద్రం స్పందన అత్యంత కీలకం.